వేసవి ఎండలో తిరుగుతున్నారు.. అయితే, మీ కురులు జాగ్రత్త!

ఆదివారం, 1 ఏప్రియల్ 2018 (12:40 IST)
వేసవి కాలం ఆరంభమైంది. అపుడే ఎండలు మండిపోతున్నాయి. పైగా, ఈ యేడాది ఎండలు తీవ్రంగా ఉంటాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సూర్యరశ్మి వేడి కారణంగా వెంట్రుకలు నిగనిగలాడటానికి తోడ్పడే ప్రోటీన్‌ దెబ్బతింటుంది. సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాలూ విపరీత ప్రభావం చూపుతాయి. మరీ ముఖ్యంగా, మహిళలు తమ కురుల సంరక్షణకు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో చిన్నపాటి చిట్కాలు పాటిస్తే చాలు.. 
 
* వెంట్రుకలకు కండిషనర్‌ను రాసి, కొద్దిసేపు షవర్‌ క్యాప్‌ ధరించాలి. ఇది ఎండకు ప్రభావితమైన కురులు తిరిగి కోలుకోవటానికి తోడ్పడుతుంది.
* వేసవిలో వెంట్రుకలు, మాడు జిడ్డుగా అవుతాయి. అందువల్ల తరచూ షాంపూతో తలస్నానం చేస్తే వెంట్రుకలు నిగనిగలాడతాయి. 
 
* ఎక్కువసేపు ఎండలో తిరగాల్సి వస్తే వెడల్పయిన అంచు గల టోపీ ధరించటం మంచిది. ఇది వెంట్రుకలతో పాటు చెవులు, మెడకూ రక్షణ ఇస్తుంది.
* వాతావరణం చాలా వేడిగా ఉన్నప్పుడు వెంట్రుకలు చిక్కుపడే అవకాశం ఎక్కువ. వెంట్రుకలు చిక్కు పడకుండా చూసే నూనెలూ వాడుకోవచ్చు.
 
* ఈతకు వెళ్లేవాళ్లు ముందుగా మంచి నీటితో తలను పూర్తిగా తడపాలి. దీనివల్ల ఉప్పునీటిని, కొలనులోని రసాయనాలను వెంట్రుకలు స్వీకరించవు. ఈత కొట్టాక తలను శుభ్రంగా తుడుచుకోవటం మంచిది. అలాగే తగినంత నీరు తాగుతూ ఒంట్లో నీటిశాతం తగ్గకుండా చూసుకోవచ్చు. ఇది వెంట్రుకలకూ మేలు చేస్తుంది.
 
* వేడినీటితో తలస్నానం చేస్తే వెంట్రుకలు పొడిబారతాయి. అదే చల్లటి నీరు వెంట్రుకల పైపొర మూసుకుపోయేలా చేసి లోపలి తేమను పట్టి ఉంచుతుంది. అందువల్ల వేసవిలో చన్నీళ్ల స్నానం చేయటం మంచిది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు