తులసి ఆరోగ్యంతో పాటు అందానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే తులసిని సర్వరోగ నివారిణి అంటారు. తులసితో కలిగే ఫలితాలు ఏమిటో ఒకసారి చూద్దాం. తులసి ఆకుల్ని నీడలో ఆరబెట్టి పొడి చేసి తేనె లేదా పెరుగుతో పాటు సేవిస్తే చాలా రోగాలు నివారణ అవుతాయి. పాలతో మాత్రం తీసుకోకూడదు. పొద్దున్నే అల్పాహారానికి అరగంట ముందు తులసి రసాన్ని సేవిస్తే జీర్ణశక్తి మెరుగవుతుంది. రోజుకు మూడు సార్లు కూడా సేవించవచ్చు.
నల్ల తులసి ఆకులు, తేనేను సమపాళ్లలో కలిపి కళ్లకు రాస్తే అలసట తగ్గడమే కాకుండా కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. ఇరవై ఐదు గ్రాముల తులసి రసాన్ని రెండు గ్రాముల నల్ల ఉప్పును కలిపి నాలుగు రోజులు క్రమంగా తీసుకుంటే నులిపురుగులు నశిస్తాయి. ఆస్తమా రోగులు ప్రతి రోజూ ఐదు నుంచి ఇరవైఐదు గ్రాముల నల్లతులసి రసాన్ని తేనేతో కలిపి తీసుకుంటే మంచిది.