46 డిగ్రీల సెంటీగ్రేడ్... భానుడి ఎండ దడ... వడదెబ్బ తగిలితే ఏం చేయాలి?

గురువారం, 18 మే 2017 (15:37 IST)
వేసవి ప్రతాపం చురచురమంటోంది. భానుడి భగభగలతో ఇంచుమించు 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వడదెబ్బ తగిలినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలని తెలుసుకోవాలో చూద్దాం.
 
* వడదెబ్బ తగిలిన వారికి.. ఉదయం, సాయంత్రం పచ్చి ముల్లంగి దుంపలు తినిపించాలి. చింతపండు నీటిలో నానబెట్టి రసం తీసి తాళింపు వేసి భోజనంతో పాటు తీసుకోవాలి. 
 
* జీలకర్ర దోరగా వేయించి పొడిచేసి అరస్పూను పొడిని, ఒక గ్లాసు నిమ్మరసంలో కలిపి, ఉప్పు, పంచదార వేసుకుని తాగాలి. పచ్చి మామిడికాయ ఉడికించి రసం తీసి పంచదార కలిపి తాగించాలి. 
 
* ద్రవపదార్థాలు మజ్జిగ, నీరు, పండ్ల రసాలు, కొబ్బరి నీరు లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. అన్నం ఉడుకుతున్నప్పుడు పైన తేటనీరు వంచి చిటికెడు ఉప్పు కలిపి తాగితే వడదెబ్బ నివారించబడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు
 
* పండిన చింతకాయలను నీటిలో పిండి ఆ రసంలో ఉప్పు కలిపి తాగవచ్చు. చల్లటి మంచినీటిలో నిమ్మరసం, ఉప్పు కలిపి మాటిమాటికీ తాగితే సమస్య నుంచి బయటపడవచ్చు. ఇంకా మేకపాలు తీసుకుని వడదెబ్బ తగిలినవారికి అరచేతులకు పాదాలకు మర్దనా చేస్తే ఉపశమనం కలుగుతుంది. 
 
వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే.. 
* శరీరంలో నీటి శాతం క్రమంగా ఉండేలా.. నీటిని సేవిస్తుండటం చేయాలి. ఎండల్లో తిరిగేటప్పుడు టోపీలు, గొడుగులు, చెప్పులు, కాటన్ దుస్తులు ధరించడం మరిచిపోకూడదు. 
 
* సన్ గ్లాసులు పెట్టుకోవడంతో పాటు ఎండల్లో ఉండాల్సి వచ్చినప్పుడు.. మజ్జిగ, కొబ్బరినీరు, నిమ్మరసం వంటివి అప్పడప్పుడు తాగుతూనే ఉండాలి. దాహంతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. శరీరంలో తేమ నిల్వ వుండేలా నీటితో కూడిన పుచ్చకాయ, దోసకాయల్ని కూడా తీసుకుంటూ వుండాలని వైద్యులు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి