చలికాలంలో వేడినీటి స్నానాన్నే అందరూ ఇష్టపడుతుంటారు. కానీ వేడినీటి స్నానం మంచిది కాదు. ఇది చర్మాన్ని మరింత పొడిబారేలా చేస్తుంది. గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. స్నానం అయిన తర్వాత చర్మం కొంచెం తడిగా ఉన్నప్పుడే పెదవులకు, ఒంటికి మాయిశ్చరైజర్లు రాసుకోవాలి. అధిక గాఢత కలిగిన సాధారణ సబ్బులను ఉపయోగించకూడదు.
చలికాలంలో కూడా ఎండతీవ్రత ఎక్కువగానే ఉంటుంది. అది ఒక్కోసారి మనకు తెలియకపోవచ్చు. అందుకే సన్‌స్క్రీన్ లోషన్స్ తప్పకుండా రాసుకోవాలి. సాధ్యమైనంత వరకూ మీ చర్మతత్వాన్ని బట్టి క్రీమ్స్ ఎంచుకోవాలి. వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగాలి. శీతాకాలంలో వాతావరణం తేమగా ఉండటం ద్వారా నీరు తాగాలని అనిపించదు. కానీ నీటిని ఎక్కువగా తాగుతూ ఉండాలి. అప్పుడే చర్మంలోని మలినాలు తొలగిపోవడమే కాకుండా చర్మం తాజాగా తయారవుతుంది. దీనికితోడు వ్యాయామం కూడా కంపల్సరీగా చేయాలి. దీనివల్ల రక్తప్రసరణ ప్రక్రియ చక్కగా సాగుతుంది. కండరాలు ఉత్తేజితం అవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అలాగే తీసుకునే ఆహారంలో జాగ్రత్త పాటించాలి. భోజనంలో తాజా పళ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. చలిలో సాధ్యమైనంతవరకు చర్మాన్ని బయటి వాతావరణంతో కనెక్ట్ కాకుండా చూసుకోవాలి. దుమ్ము, ధూళికి దూరంగా ఉండాలి. పౌడర్ల జోలికి వెళ్లకుండా ఉండడం మేలు. ఇలా చేస్తే ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవచ్చు.