భక్తులు లేని భద్రాచలం... కనిపించని రాములోడి కళ్యాణ సందడి

గురువారం, 2 ఏప్రియల్ 2020 (08:49 IST)
దేశ వ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు గురువారం జరుగుతున్నాయి. అయితే, శ్రీరాముడు నడయాడిన నేలగా ప్రసిద్ధికెక్కిన భద్రాచలంలో ఈ నవమి సందడి కనిపించడం లేదు. భక్తులు లేక భద్రాచలం బోసిపోయింది. దీనికి కారణం కరోనా వైరస్. పైగా, దేశ వ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్. దీనికారణంగా అమల్లో ఉన్న కఠిన ఆంక్షలు. 
 
ఫలితంగా ఈ దఫా భక్తులు లేకుండానే రాములవారి కల్యాణం, శ్రీరామ మహాపట్టాభిషేకం కార్యక్రమాలు జరగనున్నాయి. రామాలయ మూడున్నర శతాబ్దాల చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అంతేకాదు, దేవస్థానం చరిత్రలో తొలిసారి ఆలయంలోని నిత్య కల్యాణ మండపం వద్ద కల్యాణం నిర్వహించనున్నారు. 
 
ఈ ఘట్టానికి కూడా కేవలం అతికొద్దిమంది సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రాములోరి కల్యాణం, మహాపట్టాభిషేకం కోసం అధికారులు మూడు లక్షల రూపాయల వ్యయంతో మండపాన్ని పుష్పాలతో అలంకరించారు. ఇతర ఏర్పాట్లకు మరో రూ.2 లక్షలు ఖర్చు చేస్తున్నారు.
 
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2015, 2016 సంవత్సరాలలో మాత్రమే ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు స్వామి వారిని దర్శించుకుని పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఆ తర్వాత వివిధ కారణాలతో గత నాలుగేళ్లుగా భద్రాద్రి వెళ్లలేకపోయారు. 
 
ఈ దపా కూడా ఆయన హాజరుకావడం లేదు. దీంతో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు