పూర్వజన్మలో చేసిన పాపం పరిహారం కావాలంటే...?

బుధవారం, 25 జనవరి 2017 (17:49 IST)
కొంతమంది పాపపు పనులు చేసి దాన్ని సమర్థించుకోవడానికి అదేదో లోకోపకారం కోసమో, మరో మంచి పనికోసమో చేస్తున్నామని, దానివల్ల తమకు పాపం అంటదని అంటుంటారు. కానీ అలా అనడం చేసిన తప్పును అప్పటికి కప్పిపుచ్చుతుందే తప్ప దాని ఫలితాన్ని మాత్రం ఎవరైనా, ఎప్పటికైనా అనుభవించి తీరాల్సిందేనన్న సత్యాన్ని నిరూపించే కథ మత్స్య పురాణం ఇరవై అయిదో అధ్యాయంలో ఉంది. 
 
పూర్వం కౌశికుడు అనే ఒక మహర్షి ఉండేవాడు. కురుక్షేత్రంలో ఆయనను మించిన ధర్మాత్ముడు లేడని ఆ రోజుల్లో అంతా అంటూ ఉండేవారు. అలాంటి మహర్షికి స్వనృపుడు, క్రోధనుడు, హింస్రుడు, సిపునుడు, కవి, వాగ్ధుష్టుడు, పితృవర్తి అనే ఏడుగురు కుమారులుండేవారు. వారంతా సార్థక నామధేయులు. మొదటివాడు తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుండేవాడు. రెండోవాడు క్రోధ స్వభావంతో ఉండేవాడు. మూడోవాడు అకారణంగా ఎదుటివారికి బాధ కలిగిస్తుండేవాడు. నాలుగోవాడు చాడీలు చెబుతుండేవాడు. అయిదోవాడు ఉన్నవీ లేనివీ కల్పించి కవిత్వం అల్లుతుండేవాడు. ఆరోవాడికి నోరు తెరిస్తే చెడు మాటలే వచ్చేవి. ఏడోవాడు మాత్రం తండ్రి మీద భక్తితో నడుచుకుంటూ ఉండేవాడు. ఈ ఏడుగురిని గర్గ మహాముని వద్ద విద్యాభ్యాసం చేయమని కౌశికుడు పంపాడు. అయితే ఆ ఏడుగురికి గురువు ఎంతగా విద్య నూరిపోస్తున్నా వారు తమ సహజమైన బుద్ధులను మాత్రం మానుకోలేదు.
 
కానీ బుద్థులెలా ఉన్నా వారు మంచి తపోధనులుగానే పేరు తెచ్చుకున్నారు. ఇలా ఉండగా ఒక రోజు ఆ ఏడుగురూ గురువు గర్గమహాముని ఆజ్ఞ మేరకు పాడి ఆవును, దూడను అడవిలో మేపసాగారు. అలాంటి సమయంలో హింస్రుడు, క్రోధనుడు లాంటి వారికి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆవును చంపి తింటే బాగుండన్న దురాలోచన తట్టింది. దానికి ఏడుగురు సిద్ధపడ్డారు. అయితే చివరివాడైన పితృవర్తి మాత్రం కొంత ధర్మబుద్ధితో ఆలోచించాడు. గోహత్యాపాపం అంటకుండా తమ కోర్కె తీరాలంటే ఆ గోవు మాంసాన్ని పితృదేవతలకు శ్రద్ధతో శ్రాద్ధంగా పెడితే సరిపోతుందన్నాడు. 
 
ఆ సూచన మిగిలిన అందరికీ నచ్చింది. అలా చేసిన తరువాత సాయంత్రానికి ఒక్క దూడను మాత్రమే వెంటబెట్టుకుని ఏడుగురూ గురువు వద్దకు చేరారు. అడవిలో ఆవును, దూడను మేపుతుండగా ఒక పెద్దపులి వచ్చి ఆవును చంపి తిని వెళ్ళిందని అబద్ధం చెప్పారు. గురువు కూడా అదే నిజమని నమ్మాడు. కొంతకాలం అలా వారు విద్య నేర్చుకుంటూనే తమ బుద్ధులకు తగినట్లుగా దుర్మార్గపు పనులు చేశారు. వాటివల్ల వచ్చే పాపాన్ని పోగొట్టడానికి రకరకాల పూజలు లాంటివి చేసుకుంటూ పోసాగారు. అలా జీవితం గడిచి ఆ ఏడుగురూ మరణించారు. వారు చేసిన మహాపాపకార్యాల ఫలితం వారికి అంటిపెట్టుకునే వచ్చింది. గో హత్య చేసి పితృ శ్రాద్ధం లాంటివి పెట్టి పాపం పోయిందిలే అనుకున్నా.. తపస్సు చేసి పాపం అంటదులే అని ధైర్యంగా ఉన్నా మరుసటి జన్మలో వారి పాపానికి తగినట్లుగా జంతువులను హింసించి తినే బోయవాడి కుమారులుగా జన్మించారు.
 
మహాధార్మికులైన మహర్షి కుమారులు. గొప్ప పేరున్న గర్గముని శిష్యులు అంతోఇంతో తపశ్శక్తి సంపన్నులు అయినప్పటికీ వారికి అలాంటి జన్మ లభించింది. వారు చేసిన కొద్దిపాటి పుణ్యం వల్ల పూర్వజన్మ స్మృతి మాత్రం నిలిచి ఉంది. ఒకప్పటి తమ ఉత్తమ జన్మను వృథా చేసుకుని ప్రస్తుతం అచ్చంగా హీనమైన జీవితాన్ని గడపాల్సి వచ్చినందుకు అనుభవించిన మనోవేదన అంతా ఇంతా కాదు. అప్పటికే వారిలో వైరాగ్యం చోటుచేసుకుంది. 
 
ఇకమీదట మంచి జన్మ ప్రాప్తించాలని నిరాహార వత్రం చేసి పరమేశ్వరుడి సన్నిధిలో జ్ఞాన వైరాగ్యాలతో ధర్మమార్గంలో జీవించి కాలాంతరంలో మకరణించారు. ఆ తరువాత పూర్వజన్మ స్మృతితోనే లేళ్ళుగా జన్మించారు. ఆ జన్మలోనూ నిరాహారవ్రతం చేసి దేహత్యాగం చేశాక అప్పుడు మానస సరోవరంలో చక్రవాక పక్షులుగా జన్మించి యోగమార్గాన్ని అనుసరించారు. అప్పటికీ కానీ మళ్ళీ వారికి మానవ జన్మ లభించలేదు. ఒకరు రాజ కుమారునిగా జన్మించాడు. మిగిలిన వారు వేరువేరుగా జన్మించి పూర్వజన్మ స్మృతి వల్ల అందరూ కలుసుకుని హిమాలయాలకు తపస్సుకు వెళ్ళిపోయారు. మానవ జన్మ ఎంత మహోన్నతమైనదో తెలుసుకుని జాగ్రత్తగా అప్పుడు మసలసాగారు. కౌశిక మహర్షి కుమారుల కథ మానవ ఔన్నత్యం తెలపడంతో పాటు తప్పుచేసినవాడి జీవితం ఎలా సాగుతుందో కనువిప్పు కలిగిస్తుంది.
 
ఒకరికి మంచి చేయకపోయినా ఫర్వాలేదు. చెడు మాత్రం చేయవద్దు అని పెద్దల వచనం. అకారణంగా పూర్వజన్మలో చేసిన పాపం ఈ జన్మలో పట్టిపీడిస్తుందన్నారు. అంతేకాదు గత జన్మలో చేసిన ఇటువంటి పాప ప్రక్షాళన ఈ జన్మలో ఆ సర్వేశ్వరునికి త్రికరణశుద్ధిగా పూజలు చేయాలని చెప్పారు. అయితే కొందరు మాత్రం గత జన్మలో చేసిన పాపాలకు ఇప్పుడు పూజలు చేయడమేమిటని ప్రశ్నిస్తుంటారు. దీనికి పెద్దలు ఇలా చెప్పారు. పాప ప్రక్షాళనకు భగవంతునికి చేసే పూజలు, వ్రతాలు వంటివన్నీ రోగమొస్తే మాత్ర వేసుకోవటం వంటివి. తలనొప్పి దాని పని అది చేస్తూ ఉంటే, మందు దానికి సమాంతరంగా తన పని అది చేసుకుంటూ పోతుంది. చివరికి ఒక దశలో దాని ప్రభావం ఎక్కువై తలనొప్పి తగ్గిపోతుంది. అలాగే పూర్వజన్మలో చేసిన పాపాల ప్రభావం, వాటికి విరుగుడుగా చేసే పూజలు, వ్రతాలు శాంతులు సమాంతరంగా సాగుతుంటాయి. ఎప్పుడైతే ఆ భగవంతుని ప్రభావం ఎక్కువవుతుందో పూర్వజన్మలో చేసిన పాపాలు పటాపంచలవుతాయి.

వెబ్దునియా పై చదవండి