కప్ వచ్చేసింది: ఇక వన్డే ఫార్మాట్‌కు మాస్టర్ సచిన్ స్వస్తి!!?

అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డులతో యావత్తు క్రికెట్ ప్రపంచాన్ని ఇట్టే ఆకట్టుకున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పరిమిత ఓవర్ల వన్డే కెరీర్‌కు గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. టీమిండియా ప్రపంచకప్ గెలవడంతో తన చిరకాల స్వప్నం నెరవేరిందంటున్న మాస్టర్ బ్లాస్టర్ త్వరలో వన్డే ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పేస్తారని ప్రచారం సాగుతోంది.

38 ఏళ్ల పడిలో పడిన సచిన్ టెండూల్కర్ ఇక ఏ మాత్రం వన్డేలాడేది లేదని, అయితే, అంతర్జాతీయ కెరీర్‌లో వందో సెంచరీ పూర్తి చేయాల్సి ఉండటం ద్వారా ఇకపై జరిగే ఒక వన్డే సిరీస్‌లో మాత్రం మాస్టర్ ఆడే అవకాశం ఉందని సమాచారం. కానీ సచిన్ వందో సెంచరీ సాధించేదాకా ఆగుతాడా, ఇప్పుడే వన్డేల నుంచి రిటైర్ అవుతాడా అనే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తన సొంతగడ్డపై జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంకను మట్టికరిపించిన టీమిండియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సచిన్ ఖాతాలో ప్రపంచకప్ రికార్డు కూడా జమకావడంతో మాస్టర్ ఇక వన్డే కెరీర్‌కు స్వస్తి చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇంకేముంది.. 2015లో జరుగబోయే ప్రపంచ కప్ పోటీల్లో కూడా ఆడుతారా అని అడిగితే ప్రస్తుత విజయాన్ని పూర్తిగా ఆస్వాదించనీయండని, భవిష్యత్‌పై ఊహాగానాలొద్దని సమాధానమిస్తున్న సచిన్ వన్డే కెరీర్‌కు స్వస్తి చెబుతారో లేదో వేచి చూడాల్సిందే..!

వెబ్దునియా పై చదవండి