పాకిస్తాన్‌పై "రాజు" డకౌట్.. మరి లంకపై లంఘిస్తాడా...?!!

గురువారం, 31 మార్చి 2011 (19:43 IST)
ND
ప్రపంచకప్ పోటీలకు ముందు పేలవమైన బ్యాటింగ్ లైనప్‌తో ఘోరంగా వైఫల్యమవుతూ వచ్చిన యువరాజ్ సింగ్‌ను అసలు జట్టులోకి తీసుకుందామా..? వద్దా..? అని సెలక్టర్లు అప్పట్లో సందేహాన్ని వ్యక్తం చేశారట. ఆ దశలో ధోనీ... యూవీ జట్టులోకి రావాల్సిందేనని పట్టుబట్టాడట. ఏదేతైనేం... ధోనీ నమ్మకాన్ని యూవీ వమ్ము చేయలేదు. జట్టు విజయపరంపరలో తనదైన కీలక పాత్రను పోషిస్తున్నాడు. వరుసగా నాలుగు మ్యాచ్‌లలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను అందుకుని శభాష్ అనిపించుకున్నాడు.

పాకిస్తాన్‌పై జరిగిన సెమీఫైనల్స్‌లో దుమ్మురేపుతాడనుకుంటే డకౌటై భారత క్రికెట్ క్రీడాభిమానులను నిరాశకు గురి చేశాడు. ఈ నేపధ్యంలో శనివారం లంకపై జరుగనున్న ఫైనల్స్‌లో యువరాజ్ చెలరేగి ఆడుతాడా..? లేదా అని క్రికెట్ క్రీడాభిమానులు ఆందోళన చెందుతున్నారు.

అయితే బుధవారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రియాజ్ వేసిన బంతిలాంటిది అరుదుగా పడుతుంటుందని, అటువంటి బంతి వేసినప్పుడు ఏ ఆటగాడైనా వికెట్ సమర్పించుకోవలసిందేనని క్రికెట్ నిపుణులు చెపుతున్నారు. దురదృష్టవశాత్తూ యువరాజ్ క్రీజ్‌లో ఉండగా అటువంటి బంతి వికెట్లపైకి రావడంతో దొరికిపోయాడని వారు చెపుతున్నారు. అంతకుమించి మరేమీ కాదంటున్నారు.

ప్రపంచకప్ పోటీల్లో భారత జట్టులో తురుపుముక్కలా ఉన్న ఈ యువరాజ్ గురించి సమ్‌థింగ్.. సమ్‌థింగ్...

యువరాజ్ సింగ్ 1981 సంవత్సరం డిసెంబరు 12న జన్మించాడు. యూవీ తండ్రి భారత్ జట్టుకు చెందిన ఒకప్పటి సూపర్ ఫాస్ట్ బౌలర్, పంజాబ్ మూవీ స్టార్ యోగ్రాజ్ సింగ్. 2003లో టెస్టు మ్యాచ్‌లతో కెరీర్ ఆరంభించిన యువరాజ్ 2007-08 సంవత్సరాల మధ్య కాలంలో ఒన్డే ఇంటర్నేషనల్ టీమ్ ఇండియాకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2000 సంవత్సరంలో ఆస్ట్రేలియాతో జరిగిన ఐసీసీ ట్రోఫీ పోటీల్లో 82 బంతులకు 84 పరుగులు సాధించి అందరి దృష్టిలో పడ్డాడు.

ప్రమాదకర బౌలర్‌గా పరిగణించే మెక్ గ్రాత్ లాంటివారి బంతులను సైతం చీల్చి చెండాడు. దీంతో 2003 ప్రపంచకప్ పోటీల్లో స్థానం దక్కించుకున్నాడు యూవీ. మంచి హిట్టర్‌గా పేరు సంపాదించిన యువరాజ్ సిక్సర్ల వీరుడుగా అవతారమెత్తాడు. ఇక ఆ తర్వాత ఎన్నో రికార్డు ఇన్నింగ్స్ చేస్తూ వచ్చిన యూవీ విజయాలు తెచ్చిన అతివిశ్వాసమో.. ఏమోగానీ బాలీవుడ్ సినీగాళ్స్ మోజులో పడి కెరీర్‌ను కాస్త అశ్రద్ధ చేశాడన్న విమర్శలకు తావిచ్చాడు. దీంతో ప్రస్తుత ప్రపంచకప్ పోటీల్లో యూవీని తీసుకుందామా..? వద్దా అని సెలక్టర్లు తర్జనభర్జనలు పడినట్లు సమాచారం.

అయితే కెప్టెన్ ధోనీ నిర్ణయంతో యూవీ మరోసారి ప్రపంచకప్ 2011 పోటీల్లో భారత జట్టులో హీరో అయ్యాడు. ప్రస్తుత జోరునే లంకపైనా కొనసాగిస్తాడని ఆశిద్దాం. టీమిండియా సమష్టి కృషితో కప్‌ను కైవసం చేసుకుంటుందని కోరుకుందాం.
FILE