ఆంగ్లేయ ప్రభుత్వంపై 'దండి' యాత్ర

FileFILE
ఉప్పుపై ఆంగ్లేయ ప్రభుత్వం పన్ను విధించడాన్ని నిరసిస్తూ జాతిపిత మహాత్మా గాంధీ స్వాతంత్రోద్యమ కాలంలో చేపట్టిన మహోజ్వలమైన ఉద్యమం ఉప్పు సత్యాగ్రహం. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌ నుంచి 1930వ సంవత్సరం మార్చి 12వ తేదీన మహాత్మాగాంధీ దండి యాత్రను ప్రారంభించారు.

గుజరాత్ సముద్రం తీరం వెంబడి 400 కి.మీ.ల పాటు సాగిన మహాత్ముని యాత్ర 1930వ సంవత్సం ఏప్రిల్ ఆరవతేదీన దండిని చేరుకుంది. అక్కడే, మహాత్ముని సమక్షంలో వేలాదిగా ప్రజలు చట్టవిరుద్ధంగా సముద్ర జలాల నుంచి స్వంతంగా ఉప్పును తయారు చేసారు.

ఈ నేపధ్యంలో 1930వ సంవత్సరం ఏప్రిల్ మాసంలో కలకత్తా నగరంలో పోలీసులకు, జనసమూహానికి మధ్య హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంలో (1930-31) దాదాపు లక్షమంది ప్రజలు జైలు పాలు కాగా, పెషావర్‌లో జరిగిన ఖిస్సా ఖ్వాని బజార్ సమూహ సంహారంలో ఆయుధాలు లేని ఉద్యమకారులపై కాల్పులు జరిగాయి.

అనంతరం కొత్తగా రూపొందిన ఖుదాయి ఖిడ్మత్గర్ ఉద్యమం ( సరిహద్దు గాంధీగా వినుతికెక్కిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ దీనికి వ్యవస్థాపకులు) జాతీయ స్థాయిలో ప్రజల దృష్టికి వచ్చింది. మహాత్మాగాంధీ చెరసాలలో ఉన్న కాలంలో, 1930వ సంవత్సరం నవంబర్ మాసంలో, భారతీయ జాతీయ కాంగ్రెస్ ప్రాతినిధ్యం లేకుండా తొలి రౌండ్ టేబుల్ సమావేశం లండన్‌లో జరిగింది.

ఉప్పు సత్యాగ్రహంతో తలెత్తిన ఆర్థిక సంక్షోభంతో కాంగ్రెస్ పార్టీపై విధించిన నిషేధం తొలగించబడింది. 1931వ సంవత్సరం జనవరి మాసంలో మహాత్మా గాంధీతో పాటుగా కాంగ్రెస్ కార్యవర్గ సంఘం సభ్యులు చెరసాల నుంచి విడుదలయ్యారు.

ఇదిలా ఉండగా, 1931వ సంవత్సరం మార్చి మాసంలో చారిత్రాత్మక గాంధీ-ఇర్విన్ ఒప్పందంపై సంతకాలు చోటు చేసుకోగా, రాజకీయ ఖైదీల కారాగార వాసానికి విముక్తి కల్పించేందుకు ప్రభుత్వం అంగీకరించింది (అయినప్పటికీ, ప్రధాన విప్లవకారులకు విముక్తి లభించలేదు సరికదా విప్లవ వీరులైన భగత్‌సింగ్ మరియు అతని ఇద్దరి సహచరులకు విధించిన మరణ శిక్షను రద్దు చేయకపోవడంతో కాంగ్రెస్‌ పార్టీకి బయట నుంచే కాక పార్టీ లోపలి నుంచి కూడా వ్యతిరేకత తలెత్తింది).

ప్రభుత్వ సానుకూలతకు బదులుగా, ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాన్ని విరమించుకోవడంతో పాటుగా 1931వ సంవత్సరం సెప్టెంబరు మాసంలో లండన్‌లో జరుగనున్న రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఏకైక ప్రతినిధిగా పాల్గొనేందుకు మహాత్మా గాంధీ అంగీకరించారు. కానీ, 1931వ సంవత్సరం డిశంబర్ నాటికి ముగిసిన సమావేశం ఎలాంటి ఆశాజనక ఫలితాలను అందించలేదు.

భారతదేశానికి తిరిగి వచ్చిన మహాత్మా గాంధీ 1932వ సంవత్సరం జనవరి మాసంలో ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాన్ని పునరుద్ధరించేందుకు సంకల్పించారు. తదనంతర కొలది సంవత్సరాల కాలంలో, 1935వ సంవత్సరపు భారత ప్రభుత్వ చట్టం తొలిగేంతవరకు కూడా కాంగ్రెస్ పార్టీ మరియు ప్రభుత్వం మధ్య ఘర్షణతో కూడిన సంప్రదింపులు జరుగుతూనే ఉన్నాయి.

ఈ పరిణామంతో, కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ పార్టీల మధ్య ఒకరినొకరు వేలెత్తి చూపే స్థాయిలో విభేదాలు పొడసూపాయి. యావత్ భారతదేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహించడాన్ని ముస్లిం లీగ్ తప్పు పట్టగా, దేశంలోని ముస్లిలందరి వాణిని వినిపించే తీరులో ముస్లిం లీగ్ వ్యవహరిస్తున్నదంటూ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది.

వెబ్దునియా పై చదవండి