సైనిక సోదరుల త్యాగఫలం

WD PhotoWD
భారత స్వాతంత్ర్య సమరంలో 1857లో జరిగిన మొదటి స్వాతంత్ర్య పోరాటం దేశం మొత్తాన్ని ఓ కుదుపు కుదిపింది. 1857 సైనిక సోదరుల తిరుగుబాటు తర్వాత ఎన్నో పోరాటాలు జరిగాయి. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు లాంటి దేశ భక్తులు బ్రిటీషు అధికారులను గడగడలాడించారు. స్వాతంత్ర్యంకోసం ఎన్నో పోరాటాలు చేసి అమరులయ్యారు. వందేమాతరం నినాదంతో ప్రజలను కార్యోన్ముఖుల్ని చేసిన ఐక్య ఉద్యమం కొనసాగింది. జాతిపిత గాంధీ నేతృత్వంలో ప్రారంభమైన అహింసా పోరాటం.. యావద్భారత ప్రజలను ఒకతాటిపై నడిపించింది.

అదేసమయంలో సుభాస్ చంద్రబోసు వంటి ధీశాలులు సాయుధపోరాటాన్నితమ ఆయుధంగా ఎంచుకున్నారు. చివరికి భరతమాత ఒడిలో తమ ప్రాణాలను వదిలారు. కోట్ల మంది భారతీయుల పోరాట ఫలితంగా 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది. అయితే అప్పటివరకూ కలసి పోరు సాగించిన దేశం, స్వాతంత్ర్యంతోనే రెండు ముక్కలై భారత్, పాకిస్తాన్‌లుగా రూపుదాల్చింది. సరిహద్దు వివాదాల రూపంలో ఎందరో సైనికులు అమరులయ్యారు.

పొరుగుదేశం పాకిస్తాన్‌తో దాదాపు ఐదు యుద్ధాలకుపైగా చేసింది. ఈ యుద్ధాలన్నింటిలో మన జవానులు భయంకరమైన అవరోధాలను సైతం అవలీలగా ఎదుర్కొని శత్రువర్గాలను తుదముట్టించి భరతమాత నిండుగౌరవాన్ని కాపాడారు. నేటికీ రక్తం గడ్డకట్టే సియాచిన్ మొదలుకుని ఎక్కడ ఏ మూలనైనా తామున్నామంటూ ముందుకు ఉరుకుతారు మన సైనిక సోదరులు. ఈ 60వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా మన వీర జవానులకు వందనం సమర్పించుకుందాం.

వెబ్దునియా పై చదవండి