- బి. అవినాష్ స్వాతంత్ర్య సమరయోధులంటే ఎవరికైనా ఎనలేని గౌరవం. వారు అందరికి ఆదర్శం. గాంధీ పేరు చెపితే ఆయన మహాత్ముడు అని చెపుతారు. ఆయన లేనిదే మనకు అంత తొందరగా, ఎటువంటి రక్తపాతం లేకుండా స్వాతంత్ర్యం వచ్చేది కాదేమో. కాని అంతటి మహానుభావుడికి మనం చేసిందేమిటి ? స్వాతంత్ర్య దినోత్సవం రోజున తలుచుకోవడం తప్ప.
కాని ఆ ప్రాంతానికి చెందిన జనం ఆయనకు ఓ దేవాలయమే కట్టించారు. జాతిపిత విగ్రహాన్ని ప్రతిష్టించారు. నిత్యం పూజలు చేస్తున్నారు. బహుశా ఇది దేశంలో మరెక్కడా ఉండకపోవచ్చు. ఎన్నికల్లో ఆయన పేరు చెప్పి నాయకులు ఓట్లు దండుకుంటారు. తరువాత ఆయన ఊసే ఎత్తురు. కోస్తా కర్ణాటకలోని సుందర మంగూళూరు నగరానికి 3 కి.మీ. దూరంలో మహాత్మగాంధీ దేవాలయాన్ని నిర్మించారు.
జాతీయ రహదారి-48కి పక్కనే కంకనాడిలోని శ్రీ బ్రహ్మ బైధ్ర కాళ గారడి క్షేత్రంలో ఈ దేవాలయాన్ని నెలకొల్పారు. ఈ ప్రాంతం ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రదేశం. కొడమంతయ్య అనే అతను ఈ ప్రాంతాన్ని పాలించేటపుడు దేవాలయాన్ని గొప్ప యోధులైన తులు ఫోల్కోర్, కోటి, చెన్నయ్య, సోదరులకు అంకితమిచ్చారు. ప్రస్తుతం అదే ప్రాంగణంలో యోధులైన సోదరులతో పాటు ఆయన సోదరికి దేవాలయం ఉంది.
WD
అలాగే బ్రహ్మశ్రీ నారాయణ గురు, గణపతి, బాల పరమేశ్వరీ, ఆనంద భైరవ, సుబ్రమణ్య స్వాముల ఆలయాలున్నాయి. గారడీలు అనేవి సంప్రదాయ వ్యాయామశాలలు. యోధులు మల్ల యుద్ధంలో శిష్యులకు నైపుణ్యతలు నేర్పేవారు. తులు మాట్లాడే సామాజిక వర్గం ఈ సోదరులను అవతారపురుషులుగా భావిస్తుంది. గారడీ క్షేత్రాన్ని 1874 మార్చి 4 న నిర్మించారు. దాని మేనేజరు సోమప్ప పండిట్, అధ్యక్షుడు నరసప్పలు గాంధేయవాదులు.
వారు 1948 డిసెంబర్ 12న గాంధీ దేవాలయాన్ని నిర్మించారు. పూజారి వెంకటప్ప గాంధీ విగ్రహాన్ని తయారు చేయించి ఇచ్చారు. అప్పటి నుంచి మహాత్ముడి విగ్రహానికి పూజలు జరుగుతున్నాయి. సాధారణ దేవాలయాల్లో ఎలా పూజలు జరుగుతాయో అలాగే దూప దీపనైవేధ్యాలుంటాయి. గాంధీ జయంతి రోజున ప్రత్యేక పూజలుంటాయి.
అలాగే ఊరేగింపు కూడా ఉంటుంది. పుస్తక పఠనం చేస్తున్నట్లుగా గాంధీ విగ్రహం ఉంటుంది. క్షేత్రాన్ని దర్శించే జనం అహింసే ఆయుధంగా శాంతి, సామరస్యాలను పాటించే గాంధీకి పూజలు చేయడం మాత్రం ఎటువంటి పరిస్థితులలో మరవరు. గాంధీ జయంతి, వర్ధంతి, స్వాతంత్ర్య దినోత్సవాల రోజున ఈ దేవాలయం కిటకిటలాడుతుంది. ఈ ప్రాంతం చాలా ఆకర్షణగా మారింది.