అందరికీ ఆదర్శం.. మన స్వతంత్ర సంగ్రామం...

Munibabu

గురువారం, 14 ఆగస్టు 2008 (21:00 IST)
ఆగస్టు 15 అనగానే ప్రతి భారతీయుని శరీరం ఉద్వేగంతో పులకిస్తుంది. దాదాపు రెండు వందల ఏళ్ల బ్రిటీష్ పాలన నుంచి అఖండ భారతావని స్వేచ్ఛా వాయువులు పీల్చిన ఆ శుభ దినాన్ని తల్చుకుంటే జైహింద్ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా ప్రతి భారతీయుని కంఠం ధ్వనిస్తుంది. మతాలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, సంస్కృతులు వేరైనా మేమంతా భారతీయులమన్న భావం ప్రతివారిలో ప్రజ్వరిల్లుతుంది.

విభిన్న సంస్కృతులకు, విభిన్న ఆచారాలకు ఆలవాలమైన భారతావనిలో విదేశీయులు ప్రవేశించి భారతీయులనందరినీ బానిసలుగా చేసి రాజ్యమేలిన చీకటి రోజుల నుంచి తొలిసారి వెలుగులను చవిచూసిన ఆగస్టు 15 అంటే భారతీయులకు అతి పెద్ద శుభదినం. తరాలు మారినా మనుషులు మారినా ఆ శుభదినాన ప్రతి ఒక్కరు భరతమాతను ఒక్కసారైనా మదిలో తల్చుకుంటారు.

అదేసమయంలో భారతమాత దాస్య శృంఖాలలను తెంచేందుకు ప్రాణాలను తృణప్రాయంగా భావించిన అమర వీరులను సైతం ప్రతి ఒక్కరు స్మరించుకుంటారు. ఈనాడు తాము అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛా వాయువుల కోసం ఆనాడు పోరాడిన ప్రతి ఒక్కరికీ వారు శిరస్సు వంచి నమస్కరిస్తారు.

స్వాతంత్రం కోసం పోరాడటం, స్వాతంత్ర్యం సంపాదించడం అన్న అంశం ప్రతి దేశ చరిత్రలోనూ ప్రస్ఫుటంగా గోచరిస్తుంది. అయితే ఆ దేశాల స్వాతంత్ర సంగ్రామానికి, భారత స్వాతంత్ర సంగ్రామానికి చాలా తేడా ఉంది. ఆయా దేశాల స్వాతంత్ర సంగ్రామానికి ఎవరో కొందరు మాత్రమే ప్రాతినిథ్యం వహించి వారి దేశానికి స్వాతంత్రం సంపాదించడం జరిగింది.

కానీ భారత స్వాతంత్ర సంగ్రామం పెద్ద చరిత్ర లాంటిది. పరదేశీయులు తమపై సాగిస్తున్న అజమాయిషీని భరించలేని భారతీయులు ఒక్కొక్కరు ఏకమై మహా ప్రళయంగా మారి క్విట్ ఇండియా అంటూ బ్రిటీష్ వారిని దేశం నుంచి తరిమి వేసిన వైనం ప్రపంచ దేశాలకు ఆదర్శ ప్రాయంగా మారింది.


అంత గొప్ప చరిత్ర కల్గిన భారత స్వాతంత్ర సంగ్రామాన్ని ఓసారి నిశితంగా పరిశీలిస్తే ఎందరో త్యాగధనుల అధ్యాయాలు మనకు గోచరమవుతాయి. దేశ స్వాతంత్రమే లక్ష్యంగా దాని ముందు స్వలాభం, కుటుంబ బంధాలు లాంటి అంశాలను తృణప్రాయంగా భావించిన ఎందరో వీరుల చరిత్ర భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్ర పుస్తకంలో పేజీలై మనల్ని పలకరిస్తాయి.

భారతదేశాన్ని తమ కంబంధ హస్తాల్లో బంధించిన తెల్లదొరల గుండెల్లో నిద్రపోయిన మన్యం వీరుడు అల్లూరి నుంచి సాయుధ సంగ్రామానికి సైన్యం ఏర్పాటు చేసిన సుభాష్ చంద్రబోస్ వరకు స్వాతంత్రం కోసం ప్రాణార్పణ చేసినవారే. కానీ వారందరి ప్రాణార్పణ దేశానికి స్వాతంత్రాన్ని సంపాదించలేక పోయినా ప్రతి భారతీయుని స్వాతంత్ర సంపాధన కాంక్ష ఎగసి పడేలా చేశాయి.

అలాంటి సమయంలో దేశానికి స్వాతంత్రం సంపాదించాలంటే అది శాంతి మార్గంతోనే సాధ్యమని నమ్మి అదే దారిలో చివరివరకు పోరాడి దేశానికి స్వాతంత్రం సంపాదించి పెట్టిన ఘనత మహత్ముడికే దక్కుతుంది. అయితే ఆలోచనల్లో వైరుధ్యాలున్నా, ఎంచుకున్న మార్గాల్లో తేడాలున్నా ఆ మహానుభావుల లక్ష్యం మాత్రం దేశ స్వాతంత్రమే.

అలా ఆనాడు అంతమంది ఎన్నో కష్ట నష్టాలకోర్చి స్వాతంత్రాన్ని సంపాదించారు కాబట్టే భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్ర మహోన్నత అధ్యాయంగా నేటికీ అందరి చేతా కొనియాడబడుతోంది. అంతటి గొప్ప చరిత్రతో సాదించుకు దేశ స్వాతంత్రం గురించి, స్వాతంత్రమనే నిధి సాకారమైన ఆగస్టు 15 రోజు గురించి తల్చుకుంటే భారతీయుడైన ప్రతి ఒక్కరికీ మనసులో ఉద్వేగం ఉప్పొంగుతుంది. మది దాటిన సంతోషం జైహింద్ అని స్మరిస్తుంది.

వెబ్దునియా పై చదవండి