చిక్కుడులో మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పోషకాలున్నాయి. అలాంటిది చిక్కుడు గింజలు రోజు వారీగా అరకప్పు తింటే డయాబెటిస్, రక్తహీనతకు చెక్ పెట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగని చిక్కుడు గింజల్ని రోజూ ఉడికించి తినడం బోరు కొడుతుందని అనుకుంటున్నారా.. అయితే చిక్కుడు గింజలతో గ్రేవీ ఎలా చేయోలో ట్రై చేయండి.
కావల్సిన పదార్థాలు : చిక్కుడు గింజలు- పావుకిలో టమాటాలు - నాలుగు ఉల్లిపాయలు - రెండు పచ్చి మిర్చి- మూడు అల్లం వెల్లుల్లి - చెంచా గరంమసాలా - చిటికెడు పసుపు - చిటికెడు కొత్తిమీర - కట్ట ఉప్పు - రుచికి సరిపడా.
తయారు చేయు విధానం : ముందుగా చిక్కుడు గింజలను కడిగి కుక్కర్‌లో మూడు కూతలు వచ్చే వరకూ ఉడికించి దించేయాలి. తరువాత టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చిని సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఆ ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి
తర్వాత బాణలిలో నూనె వేడయ్యాక పసుపు, రుబ్బి పెట్టుకున్న మిశ్రమాన్ని వేయాలి. పచ్చివాసన పోయిన తరువాత అల్లం వెల్లుల్లి ముద్ద, గరం మసాలా, తగినంత, ఉప్పు చేర్చాలి. కొద్దిసేపటికి రెండు గ్లాసుల నీళ్ళుపోసి మూత పెట్టాలి.
గ్రేవీ కాస్త దగ్గరపడ్డాక ఉడికించి పెట్టుకున్న చిక్కుడు గింజలు చేర్చి కలియతిప్పాలి. రెండు, మూడు నిమిషాలు గింజలు గ్రేవీలో ఉడికాక పొయ్యి కట్టేసి కొత్తిమీర చల్లి దించేస్తే సరి. కూరగాయల బిర్యానీలోకి ఇది చక్కటి సైడిష్‌గా ఉంటుంది. చపాతీలు, పుల్కాల్లోకి నంజుకొని తింటే బాగుంటుంది.