ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెయిట్ లిప్టింగ్ క్రీడాకారిణి బొరాడి ప్రమీలవల్లిపై భారత వెయిట్ లిప్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్) జీవితకాల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. కెరీర్లో రెండుసార్లు డోప్ టెస్టుల్లో పట్టుబడడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాఖ్య పేర్కొంది.
గత నెల నొయిడాలో జరిగిన జూనియర్ జాతీయ ఛాంపియన్ షిప్ పోటీల సందర్భంగా ప్రమీలవల్లి డోప్ పరీక్షల్లో పట్టుబడింది. గతంలో సైతం ఇదే విధంగా డోపింగ్ టెస్టులో పట్టుబడిన చరిత్ర ఉండడంతో ప్రమీలపై ఐడబ్ల్యూఎఫ్ జీవితకాల నిషేధం విధించింది. గతంలో 2006లో మెల్బోర్న్లో జరిగిన కామన్వెల్త్ క్రీడల సందర్భంగా వాడా నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో సైతం ప్రమీల పట్టుబడడంతో అప్పట్లో ప్రమీలపై రెండేళ్ల నిషేధం విధిస్తూ ఐడబ్ల్యూఎఫ్ నిర్ణయం తీసుకుంది.
అప్పుడు విధించిన రెండేళ్ల నిషేధం ఈ ఏడాది మార్చిలో పూర్తికాగా మళ్లీ ప్రమీల డోపింగ్ పరీక్షల్లో పట్టుబడడం గమనార్హం. ప్రమీలతో పాటు కర్ణాటకు చెందిన వెయిట్ లిఫ్టర్ సతీష్ రాయ్‌పై కూడా జీవితకాల నిషేధం విధిస్తూ సమాఖ్య నిర్ణయం తీసుకుంది.