భారత్‌లోని వర్థమాన క్రీడాకారులకు చేయూతనిచ్చే దిశగా తాను ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు ఒలింపిక్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా తెలిపారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా తన ఆధ్వర్యంలో 500 పబ్లిక్ స్కూళ్లను ప్రారంభించనున్నట్టు బింద్రా పేర్కొన్నారు.
ఈ విషయమై బింద్రా మాట్లాడుతూ నాణ్యమైన విద్య, క్రీడల్లో శిక్షణ ఇచ్చే విధంగా ఈ స్కూళ్లను తీర్చిదిద్దనున్నట్టు తెలిపారు. అభినవ్ బింద్రా ఏస్ పబ్లిక్ స్కూల్స్ (ఏబీఏపీఎస్) పేరుతో స్థాపించనున్న ఈ పాఠశాలల విషయమై బింద్రా మీడియాకు వివరించారు. తాను స్థాపించనున్న ఈ పాఠశాలల బాగోగులను తాను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తానని బింద్రా తెలిపాడు.
భవిష్యత్‌లో ప్రతి రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో తన పాఠశాలలకు సంబంధించిన శాఖ ఉండేలా చూస్తానని బింద్రా పేర్కొన్నాడు. ఈ పాఠశాలలకు సంబంధించి చదువు ఇతర వసతులు అన్ని చోట్లా ఒకేలా ఉంటాయని కూడా బింద్రా తెలిపాడు. ఈ పాఠశాలల్లో విద్యతో పాటు షూటింగ్, ఆర్చరీ, ఈక్వెస్ట్రియన్, టెన్నిస్, బ్యాడ్మింటన్ తదితర క్రీడల్లో విద్యార్ధుల ఉన్నత స్థాయి శిక్షణ అందించనున్నట్టు బింద్రా తెలిపాడు.