ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణం - హాజరైన అతిరథ మహారథులు

ఠాగూర్

శుక్రవారం, 12 సెప్టెంబరు 2025 (10:57 IST)
దేశ కొత్త ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతోపాటు, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్, నితిన్‌ గడ్కరీ తదితరులు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌లతో పాటు ఎన్డీయే పాలకపక్షానికి చెందిన ముఖ్య నేతలు హాజరయ్యారు. వీరితో పాటు మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానులు, మాజీ ఉప రాష్ట్రపతులనూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. మాజీ రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతులు జగదీప్ ధన్‌ఖడ్, వెంకయ్యనాయుడు హాజరయ్యారు. 
 
ఉప రాష్ట్రపతి ఎన్నికకు ఈనెల 9న జరిగిన పోలింగ్‌లో ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌ తన సమీప ప్రత్యర్థి జస్టిస్‌ బి.సుదర్శన్‌ రెడ్డిపై 152 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఎన్నిక లాంఛనాలన్నీ పూర్తికావడంతో గురువారం మహారాష్ట్ర గవర్నర్‌ పదవికి సీపీ రాధాకృష్ణన్‌ రాజీనామా చేశారు. దీంతో మహారాష్ట్ర బాధ్యతలను గుజరాత్‌ గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌కు రాష్ట్రపతి ముర్ము అప్పగించారు.
 
జులై 21న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల తొలిరోజే ధన్‌ఖడ్‌ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ రోజు ఉదయమంతా రాజ్యసభ కార్యక్రమాలను సజావుగా నిర్వహించిన ఆయన.. రాత్రికల్లా అనూహ్య నిర్ణయాన్ని ప్రకటించారు. అనారోగ్య కారణాల వల్లే తాను పదవి నుంచి దిగిపోతున్నట్లు తెలిపారు. అయితే, నోట్ల కట్టల కేసుకు సంబంధించిన జస్టిస్‌ యశ్వంత్‌వర్మ అభిశంసన వ్యవహారంలో కేంద్రంతో విభేదాలు రావడం వల్లే ఆయన వైదొలిగినట్లు విపక్షాలు ఆరోపించిన సంగతి తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు