గ్రాండ్‌శ్లామ్ వేదికకోసం మెల్‌బోర్న్, సిడ్నీల పోటీ

మంగళవారం, 14 అక్టోబరు 2008 (16:57 IST)
టెన్నిస్ క్రీడాకారులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్ట్రేలియా ఓపెన్ నిర్వహణ హక్కుల కోసం మెల్‌బోర్న్, సిడ్నీల మధ్య పోటీ ఉదృతమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇప్పటివరకు ఆస్ట్రేలియా ఓపెన్ మెల్‌బోర్న్ నగరంలోనే జరుగుతున్న విషయం తెలిసిందే.

ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియా ఓపెన్ నిర్వహణ కోసం అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్యతో మెల్‌బోర్న్ నగరం కుదుర్చుకున్న ఒప్పందం రానున్న 2016కు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో 2016 తర్వాత టోర్నీ నిర్వహణను తామే చేజిక్కించుకోవాలని సిడ్నీ నగరం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం సిడ్నీ టెన్నిస్ కార్యవర్గం ఓ టెన్నిస్ కాంప్లెక్స్ నిర్మాణానికి కూడా సిద్ధమయ్యారు.

అయితే ఆస్ట్రేలియా ఓపెన్ నిర్వాహక హక్కులను తమనుంచి ఎవరూ అంత సులభంగా తీసుకోలేరని మెల్‌బోర్న్ నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఈ విషయమై మెల్‌బోర్న్ ప్రతినిధి జాన్‌బ్రంబీ మాట్లాడుతూ మెల్‌బోర్న్‌లో ఉన్న వసతి, సౌకర్యాల దృష్ట్యా ఆటగాళ్లు ఇక్కడ ఆడడానికే ఇష్టపడుతారని అన్నారు. అందుకే మెల్‌బోర్న్ నుంచి ఆస్ట్రేలియా ఓపెన్ నిర్వాహక హక్కులు మరెవరూ తీసుకోలేరని ఆయన పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి