బెడ్ రూం అలంకరణ తీరు తెన్నులు

శుక్రవారం, 23 జనవరి 2009 (20:12 IST)
బెడ్ రూం అలంకరణలో ఇష్టాలకు అభిరుచులకు ప్రాధాన్యత ఇవ్వటం కంటే మానసిక ఉపశమనానికి ప్రాధాన్యం ఇవ్వాలని డిజైనర్లు చెబుతున్నారు. గోడల రంగులు డోర్ కర్టెన్లు విండో కర్టెన్లు వంటివి కంటికి భారంలా అనిపించకుండా రూం లోకి వెళ్లగానే మనసుకు ఉపశమనం కలిగించేలా అమర్చుకోవాలని వీరు సలహా చెబుతున్నారు. అవేమిటో చూద్దాం..
మీ బెడ్ రూం.. మీ ఇష్టం..
  మీ బెడ్‌రూం మీ ఇష్టం.. దీనిని ఎవరూ కాదనరు కానీ.. అలసిపోయిన మీ ఒంటికి మనసుకు కంటి నిండా కాస్త నిద్ర పట్టేలా మీ బెడ్ రూం అలంకరణ ఉంటే చాలా మంచిది. నిద్ర సుఖమెరుగదు అలాగే ఖరీదైన అలంకరణలను కూడా కోరుకోదు.      


పని ఒత్తిడితో అలసిపోయి ఇంటికి వచ్చాక పడుకోగానే నిద్రపట్టేలా బెడ్ రూమ్ ఉంటే చాలు. నిద్ర సరిగా పట్టాలంటే బెడ్‌ రూంలో ప్రకాశవంతమైన లేదా ముదురు రంగులు ఉండరాదు. ఉదాహరణకు ఆరెంజ్ వంటి ముదురు రంగులు వాడకుంటే మంచిది. గదిలోకి అడుగు పెట్టగానే ఒకలాంటి ఉపశమనాన్ని కలిగించేలా గోడల రంగులు ఉండాలి.

అలాగే గోడల రంగులకు సరిపోయేలా డోర్ కర్టెన్లు, విండో కర్టెన్లు అమర్చుకోవాలి. అయితే అన్ని కర్టెన్లు కూడా ఒకే రంగులో ఉంటే చూసేందుకు బాగుండదు. కొన్ని రంగులకయితే వాటికి సరిపోయే రకం కర్టెన్లనే ఉపయోగించాలి.

గోడకు తగిలించే బొమ్మలు వంటి వాల్ హేంగింగ్‌ల కోసం ఎక్కువగా ఖర్చు పెట్టవలసిన పనిలేదు. ఖరీదైన వస్తువులు కొనడం మాని, పిల్లలు స్వంతంగా వేసిన డ్రాయింగ్ కాని పెయింటింగ్ కాని ఫ్రేమ్ కట్టించి తగిలించండి. దీనివల్ల గది గోడలకు కొత్త అందం రావడమే కాక పిల్లలు కూడా తమ పెయింటింగులను చూసుకుని ఆనందిస్తారు మరి.

సిట్టింగ్ రూం గోడలకు లేదా పిల్లల బెడ్ రూంలో వాల్ హేంగింగ్స్ తగిలిస్తే గది కాస్తా వెలుగుతుంది మరి. ఇలాంటి అమరికలు నేర్చుకుంటే వచ్చేవి కావు. ఎవరి అవసరాలకు, అభిరుచులకు తగ్గట్లుగా వారు సృజనాత్మకంగా ఎంచుకోవాలి. మీ మనసుకు తగినట్లే మీ బెడ్‌రూం కూడా ఉంటే మంచిది కదూ...

వెబ్దునియా పై చదవండి