ఆఫ్గనిస్థాన్‌లో 8 మంది అమెరికా సైనికుల హతం

సోమవారం, 5 అక్టోబరు 2009 (10:09 IST)
తీవ్రవాదుల ఏరివేత కోసం అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు సాగిస్తున్న పోరులో అమెరికాకు చెందిన ఎనిమిది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఆఫ్గన్‌లోని సూరిస్థాన్ రాష్ట్రంలో తీవ్రవాదులు ఆదివారం చేసిన దాడిలో వీరు మృత్యువాత పడ్డారు. ఈ ప్రాంతంలోని పర్వత ప్రాంతంలో ఉన్న చెక్‌పోస్ట్‌పై వందలాది మంది తాలిబన్ తీవ్రవాదులు ఒక్కసారి దాడి చేశారు.

తీవ్రవాదుల దాడిని తిప్పికొట్టేందుకు అంతర్జాతీయ భద్రతా సహకార సైన్యంతో పాటు.. ఆఫ్గన్ జాతీయ భద్రతా సిబ్బంది ఎదురుదాడికి పాల్పడ్డారు. కొన్ని గంటల పాటు సాగిన ఈ హోరాహోరీ పోరులో ఎనిమిది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయినట్టు ఆఫ్గన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇదిలావుండగా, తాము చేసిన దాడిలో 30 మంది సైనికులు, మరికొంతమంది ఆఫ్గన్ సైనికులు మృత్యువాత పడినట్టు తాలిబన్ తీవ్రవాద ప్రతినిధి మరో ప్రకటనలో తెలిపారు.

వెబ్దునియా పై చదవండి