ఇరాక్‌లో బాంబు పేలుడు: 28 మంది మృతి

దక్షిణ ఇరాక్‌లోని రద్దీగా ఉండే మార్కెట్ ప్రదేశంలో బుధవారం సంభవించిన బాంబు పేలుడులో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 35 మంది ఈ కారు బాంబు దాడిలో గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. నసారియాకు పశ్చిమంగా 20 మైళ్ల దూరంలో ఉన్న అల్- బాథాలో జరిగిన కారు బాంబు దాడిలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని నసారియా ప్రాంతీయ మండలి అధికారి అక్రమ్ అల్ తమీమీ వెల్లడించారు.

అమెరికా దళాలు ఇరాక్‌లో యుద్ధం ప్రారంభించిన తరువాత దేశవ్యాప్తంగా వర్గపోరు, తిరుగుబాట్లు విస్తరించినప్పటికీ దక్షిణ ప్రాంతంపై మాత్రం ఈ ప్రభావం పడలేదు. ఈ ప్రాంతంలో షియా వర్గీయులు ఎక్కువగా నివసిస్తున్నారు. అయితే అప్పుడప్పుడు సున్నీ తీవ్రవాదులు, అల్‌ఖైదా ఇక్కడ కారు, ఆత్మాహుతి దాడులకు పాల్పడుతున్నాయి.

వచ్చే జనవరిలో జరగబోతున్న పార్లమెంటరీ ఎన్నికల సందర్భంగా పెద్దఎత్తున హింసాకాండ జరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అమెరికా దళాలు ఇరాక్ నగరాలను ఈ నెలాఖరుకు ఖాళీ చేస్తుండటం ద్వారా దాడులు పెరుగుతాయని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా జరిగిన కారు బాంబు దాడిలో మృతుల సంఖ్యపై భిన్నకథనాలు వినిపిస్తున్నాయి. భద్రతా దళాలు మొత్తం 30 మంది ఈ దాడుల్లో మృతి చెందారని చెబుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి