అవినీతి, పద్దెనిమిది రోజులపాటు సాగిన ప్రజాందోళనలో ఆందోళనకారులను చంపడానికి ఆదేశాలు చేయడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈజిప్ట్ మాజీ అధ్యక్షుడు హోస్నీ ముబారక్‌పై బుధవారం నుంచి విచారణ ప్రారంభం కానుంది. సుదీర్ఘకాలంపాటు తమను పాలించి అష్టకష్టాలు పాలు చేసిన ఈ మాజీ అధ్యక్షున్ని శిక్షించాలని చాలా మంది ఈజిప్ట్ పౌరులు కోరుకుంటున్నారు.
అయితే ఈ విచారణ ముబారక్ గత పాపాలను అన్నింటిని వెలికితీయగలదా అనే ప్రశ్న కూడా వారి మదిని తొలచివేస్తున్నది. ఈజిప్ట్ నూతన సైనిక పాలకులు దర్యాప్తు తూతూ మంత్రంగా పూర్తి చేస్తారని కొంత మంది పౌరులు ఆందోళన చెందుతున్నారు. పదవీచ్యుత అధ్యక్షుడిని విచారించడం అరబ్ ప్రపంచంలో ఒక అసాధారణ విషయం. ఒక ఆధునిక మధ్యప్రాశ్చ నాయకుడుపై ప్రజలు దర్యాప్తు కోరడం ఇదే తొలిసారి.