కొరియాతో జర్నలిస్ట్‌ల విడుదలపై బిల్ చర్చలు

అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ మంగళవారం ఉత్తర కొరియా పర్యటనకు విచ్చేశారు. తీవ్ర నేరాల కింద ఉత్తర కొరియా న్యాయవ్యవస్థ దోషులుగా పరిగణించిన ఇద్దరు అమెరికా జర్నలిస్ట్‌ల విడుదలపై ఆయన ఈ పర్యటనలో చర్చలు జరుపుతారు. ఇదిలా ఉంటే అణు పరీక్ష, వరుస క్షిపణి పరీక్షలు నిర్వహించడంతో ఉత్తర కొరియాపై పశ్చిమ దేశాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి.

అంతర్జాతీయ సమాజం ఎన్ని ఒత్తిళ్లు తెస్తున్నప్పటికీ వివాదాస్పద అణు కార్యక్రమాన్ని నిలిపివేసేందుకు ఉత్తర కొరియా నిరాకరిస్తోంది. అంతేకాకుండా వరుసగా క్షిపణి పరీక్షలు నిర్వహిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. బహుళపాక్షిక అంతర్జాతీయ చర్చలకు వచ్చేందుకు కూడా ఉత్తర కొరియా నిరాకరిస్తోంది. ఈ చర్చల దిశగా ఉత్తర కొరియా అధికారిక యంత్రాంగాన్ని క్లింటన్ తాజా పర్యటనలో ప్రోత్సహించే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే ఉత్తర కొరియాలో గత నెలలో ఇద్దరు అమెరికా జర్నలిస్ట్‌లకు కోర్టు 12 ఏళ్ల కఠిన కార్మిక శిక్షను విధించింది. చైనా సరిహద్దుల గుండా తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించినందుకు ఉత్తర కొరియా అధికారిక యంత్రాంగం మార్చి నెలలో ఈ ఇద్దరు అమెరికా జర్నలిస్ట్‌లను అరెస్టు చేసింది. వీరిని విడుదల చేయాలని తాజా పర్యటనలో బిల్ క్లింటన్ ఉత్తర కొరియా అధికారిక యంత్రాంగాన్ని కోరనున్నారు.

వెబ్దునియా పై చదవండి