చైనాలో ప్లేగు వ్యాధి బారినపడి ముగ్గురి మృతి

వాయువ్య చైనాలో ప్లేగు వ్యాధి బారినపడి మృతి చెందినవారి సంఖ్య 3కి చేరుకుంది. స్థానిక ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. శ్వాసకోశాలకు సంబంధించిన ప్లేగు ప్రబలడంతో జికెటన్ పట్టణంలో ప్రజలు భయభ్రాంతులవుతున్నారు. ఆరోగ్య శాఖ సిబ్బంది పట్టణంలో వ్యాధి కొత్తవారికి వ్యాపించకుండా చర్యలు చేపట్టారు.

తాజాగా జికెటన్ పట్టణంలో ప్లేగు కారణంగా మృతి చెందిన వ్కక్తిని డాంజి (64)గా గుర్తించారు. స్వయంప్రతిపత్తి కలిగిన హైనాన్ టిబెట్ ప్రాంతంలో ఈ పట్టణం ఉంది. ఈ పట్టణంలో సుమారు పది వేల మంది పౌరులు నివసిస్తున్నారు. గత గురువారం ఇక్కడ ప్లేగు వ్యాధి వెలుగుచూసింది. ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు వ్యాధి కారణంగా మృతి చెందారు.

తాజాగా మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని అధికారిక వర్గాలు చెప్పాయి. మరో తొమ్మిది మందిలో వ్యాధి లక్షణాలు బయటపడ్డాయని, వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

నిమోనిక్ ప్లేగు అనే ఈ భయానక వ్యాధి చాలా వేగంగా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు అది ఇంకొకరి వ్యాప్తి చెందుతుంది. వ్యాధి సోకిన వ్యక్తికి సరైన చికిత్స అందించకపోతే, 24 గంటల్లోగానే మరణం ముంచుకొస్తుంది.

వెబ్దునియా పై చదవండి