చైనా ఆరోపణలపై పాక్ ఖండన: ఇద్దరు తీవ్రవాదుల కాల్చివేత!

బుధవారం, 3 ఆగస్టు 2011 (09:30 IST)
జిన్‌జియాంగ్ రాష్ట్రంలో ఇటీవల పేలుళ్ళకు పాల్పడింది పాకిస్థాన్ గడ్డపై శిక్షణ తీసుకున్న తీవ్రవాదులేనంటూ బీజింగ్ చేసిన ఆరోపణలపై పాకిస్థాన్ తీవ్రంగా ఖండించింది. అదేసమయంలో ఈ పేలుళ్ళకు పాల్పడినట్టు అనుమానిస్తున్న ఇద్దరు తీవ్రవాదులను చైనా బలగాలు కాల్చి చంపాయి.

పశ్చిమ రాష్ట్రం జిన్‌జియాంగ్‌లో గత వారంలో చోటు చేసుకున్న పేలుళ్ళ హింసాకాండకు పాక్‌లో శిక్షణ పొందిన యుగర్ జాతి మిలిటెంట్లేబాధ్యులన్న విషయం తమ ప్రాథమిక విచారణలో తేలినట్టు బీజింగ్ పేర్కొంది. తూర్పు తుర్కిస్థాన్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ సంస్థ (ఈటీఐఎం) శిబిరాల్లో శిక్షణ పొందిన దుండగులే ఈ హింసకు పాల్పడ్డారని జిన్‌జియాంగ్‌లోని కస్గార్ నగర పాలక సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

దీనిపై పాకిస్థాన్ విదేశాంగ స్పందించింది. జిన్‌జియాంగ్ పేలుళ్ళకు పాల్పడింది తమ దేశ తీవ్రవాదులు కాదని వ్యాఖ్యానించింది. ఇందుకు సంబంధించి ఏదైనా ఆధారాలు చిక్కితే తమకు అందజేయాలని కోరింది.

వెబ్దునియా పై చదవండి