జిన్‌జియాంగ్ పేలుళ్ళకు పాల్పడింది పాకిస్థాన్ ఉగ్రవాదులేనని చైనా ఆరోపించింది. ఇప్పటి వరకు ప్రతి విషయంలోనూ పాకిస్థాన్‌కు పూర్తి మద్దతు తెలుపుతూ వచ్చిన చైనా.. ఉన్నట్టుండి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
పశ్చిమ రాష్ట్రం జిన్‌జియాంగ్‌లో గత వారంలో చోటు చేసుకున్న పేలుళ్ళ హింసాకాండకు పాక్‌లో శిక్షణ పొందిన యుగర్ జాతి మిలిటెంట్లేబాధ్యులన్న విషయం తమ ప్రాథమిక విచారణలో తేలినట్టు బీజింగ్ పేర్కొంది. తూర్పు తుర్కిస్థాన్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ సంస్థ (ఈటీఐఎం) శిబిరాల్లో శిక్షణ పొందిన దుండగులే ఈ హింసకు పాల్పడ్డారని జిన్‌జియాంగ్‌లోని కస్గార్ నగర పాలక సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ పేలుళ్ళ కోసం యుగర్ తీవ్రవాదులు పాక్‌లోని ఈటీఐఎం స్థావరాల్లో ఆయుధ, పేలుడు సామగ్రి వాడకంలో శిక్షణ పొందినట్టు తేలిందని పేర్కొంది. కాగా, ఈ దాడులపై చైనా సంధించిన ఆరోపణలపై పాక్ ప్రభుత్వం స్పందించింది. ఈటీఐఎంను అడ్డుకోవడంలో చైనాకు సహకరిస్తామని పాక్ విదేశాంగ ప్రకటించింది.