ఆఫ్గనిస్థాన్ క్యాబినెట్ మంత్రిపై తాలిబన్లు ఆదివారం నాడు బాంబులతో దాడులు చేశారు. ఆఫ్గనిస్థాన్‌కు పశ్చిమాన ఉన్న హేరత్ పట్టణంలో ఆదివారం తాలిబన్లు రోడ్డుపక్కన పొంచివుండి ఇంధన మరియు జలవనరుల శాఖామంత్రి ముహమ్మద్ ఇస్మాయిల్ ఖాన్‌పై బాంబులతో దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో ఆయన ప్రాణాలతో బయటపడినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
ఆదివారం ఉదయం ఖాన్‌పై జరిపిన ఈ దాడులకు తాలిబన్లే కారణమంటూ తాలిబన్ నాయకులు ప్రకటించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఇస్మాయిల్ ఖాన్, జబివుల్లా ముజాహిద్‌లను అంతమొందించడమే తమ లక్ష్యమని తమ శాఖకు తాలిబన్ ప్రతినిధి ఫోన్‌లో తెలిపినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
హేరత్ పట్టణ సివార్లలో ఓ పాఠశాల వద్ద ఈ దాడులు జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇందులో ముగ్గురు సాధారణ పౌరులు మృతి చెందగా, మరో 16 మంది తీవ్ర గాయాలపాలైనట్లు స్థానికులు తెలిపారు.
ఖాన్ కాబుల్ వైపు వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగిందని, కాని అదృష్టవశాత్తు ఆయన ప్రాణాలతో బయటపడ్డారని, కాని ముగ్గురు పౌరులు మాత్రం మృతి చెందారని పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రగాయాల పాలైనవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామని వారు పేర్కొన్నారు.