తాలిబాన్లతో చర్చలే ఉత్తమమార్గం: ఫ్రాన్స్

ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబాన్ తీవ్రవాద సమస్య పరిష్కారానికి చర్చలే ఉత్తమ మార్గమని ఫ్రాన్స్ ప్రభుత్వం ఇప్పటికీ భావిస్తోంది. ఆగస్టు 20న ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలకు విఘాతం కలిగిస్తామని తాలిబాన్ తీవ్రవాదులు ఇప్పటికే ప్రకటించారు. ఇందులో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో వారు బాంబు దాడులకు కూడా తెగబడుతున్నారు.

ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి బెర్నార్ కౌచ్నెర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాలిబాన్లతో చర్చలకు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. తాలిబాన్లతో చర్చలే ఉత్తమ పరిష్కార మార్గం. అందరితో చర్చలు జరపలేకపోయినా, కనీసం ఆయుధాల వదిలిపెట్టాలనుకుంటున్న తాలిబాన్లతోనైనా మనం చర్చలు జరపాలని కౌచ్నెర్ సూచించారు.

ఇదిలా ఉంటే ఆఫ్ఘనిస్థాన్‌లో శనివారం అనుమానిత తాలిబాన్ తీవ్రవాదుల దాడిలో ఫ్రెంచ్ సైనికుడొకరు మృతి చెందారు. అదే రోజు ముగ్గురు అమెరికా సైనికులు, ఇద్దరు కెనడా సైనికులు కూడా తీవ్రవాదుల అనూహ్య దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే ఆదివారం జరిగిన బాంబు దాడిలో మరో ముగ్గురు అమెరికా సైనికులు మృతి చెందారు.

వెబ్దునియా పై చదవండి