తాలిబాన్లు ఇప్పుడు ఇంకా బలంగా ఉన్నారు

పాకిస్థాన్ తాలిబాన్ ఉద్యమం గతంలో ఎన్నడూ లేనంత బలంగా ఉందని ఓ తీవ్రవాది వెల్లడించాడు. తెహ్రీక్ ఎ తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) అగ్రనేత బైతుల్లా మెహసూద్ మరణించినప్పటికీ, తమ గ్రూపు బలం మాత్రం ఏమాత్రం తగ్గలేదని, గతంలో ఎన్నడూ లేనంత బలంగా ఉందని ఆ గ్రూపుకు చెందిన మరో అగ్రనేత వెల్లడించాడు.

పాకిస్థాన్ సైన్యం తమపై మరోసారి సైనిక చర్యకు దిగితే మరిన్ని ఆత్మాహుతి దాడులు జరుపుతామని హెచ్చరించాడు. తాలిబాన్ ఆత్మాహుతి దళ సభ్యులకు శిక్షకుడిగా పేరొందిన ఖారీ హుస్సేన్ మెహసూద్ ఓ వార్తా సంస్థ విలేకరితో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లోని ఉత్తర వజీరిస్థాన్‌లో ఓ రహస్య ప్రదేశంలో అతను మాట్లాడాడు.

ఇదిలా ఉంటే దీనికి కొన్ని గంటల తరువాత పాక్ గిరిజన ప్రాంతంలో అమెరికా క్షిపణి దాడి జరిపింది. ఇందులో 12 మంది పౌరులు మృతి చెందారు.

పాకిస్థాన్‌లో సమస్యాత్మక వాయువ్య ప్రాంతంలో తాలిబాన్, అల్ ఖైదా అగ్రనేతలను హతమార్చేందుకు అమెరికా సేనలు గత ఏడాది కాలంగా తరచుగా క్షిపణి దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్ ప్రభుత్వం మాత్రం బయటకు అమెరికా దాడులను ఖండిస్తున్నప్పటికీ, రహస్యంగా అమెరికా సహకరిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి