తాలిబాన్ తీవ్రవాదుల వద్ద బందీలుగా ఉన్న 80 మందిని పాకిస్థాన్ ఆర్మీ విడిపించింది. పాకిస్థాన్‌లోని సమస్యాత్మక నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్‌లో సోమవారం తాలిబాన్ తీవ్రవాదులు వీరిని బందీలుగా తీసుకున్న సంగతి తెలిసిందే. వీరిలో 80 మందిని విడిపించామని పాకిస్థాన్ ఆర్మీ మంగళవారం వెల్లడించింది.
వజీరిస్థాన్ గిరిజన ప్రాంతంలో చోటుచేసుకున్న కిడ్నాప్ డ్రామాకు ఈ రోజు తెరపడిందని, 80 మంది కాడెట్ కళాశాల విద్యార్థులు, సిబ్బందిని తాలిబాన్ల చెర నుండి విడిపించామని ఆర్మీ ప్రతినిధులు తెలిపారు. రాజ్‌మక్ కాడెట్ కళాశాలలో 71 మంది విద్యార్థులు, 9 మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారని వెల్లడించారు.
వీరిని విడిపించే ప్రయత్నాల్లో భాగంగా తాలిబాన్ తీవ్రవాదులకు, ఆర్మీ సిబ్బంది మధ్య ఉత్తర వజీరిస్థాన్‌లోని రాజ్‌మక్ పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఘారియం వద్ద ఎదురుకాల్పులు జరిగాయి. కిడ్నాప్ చేసిన విద్యార్థులను, సిబ్బందిని నాలుగు నుంచి ఐదు కార్లలో తాలిబాన్లు దక్షిణ వజీరిస్థాన్ తీసుకెళుతుండగా ఆర్మీ సిబ్బంది వారిని అడ్డగించి విడిపించారు.