ద కొరియా అంతరిక్ష ప్రయోగానికి రంగం సిద్ధం

దక్షిణ కొరియా తొలి అంతరిక్ష రాకెట్ ప్రయోగానికి రంగం సిద్ధమైంది. దక్షిణ కొరియా బుధవారం అంతరిక్షంలోకి రాకెట్‌‍ను ప్రయోగించనుంది. ఈ రాకెట్ ఓ ప్రయోగాత్మక ఉపగ్రహాన్ని భూమి దిగువ కక్ష్యలోకి తీసుకెళుతుంది. దక్షిణ కొరియా విద్యా, విజ్ఞాన, సాంకేతిక మంత్రిత్వ శాఖ ఈ మేరకు వివరాలు వెల్లడించింది.

నారో లేదా కొరియా స్పైస్ లాంచ్ వెహికల్- 1 అనే రాకెట్ నారో అంతరిక్ష కేంద్రం నుంచి బుధవారం అంతరిక్షంలోకి దూసుకెళ్లనుంది. ఆ దేశంలోని దక్షిణ జియోల్లా ప్రావీన్స్‌లో ఉన్న గెహెవుంగ్ ప్రాంతంలో ఈ రాకెట్ లాంచింగ్ కేంద్రం ఉంది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించాలని అధికారిక యంత్రాంగం నిర్ణయించింది.

దక్షిణ కొరియో రెండు దశల ఉపగ్రహ వాహక నౌకను రష్యా సహకారంతో అభివృద్ధి చేసింది. రష్యాకు చెందిన ఖ్రునిచెవ్ స్టేట్ స్పేస్ సైన్స్ అండ్ ప్రొడక్షన్ సెంటర్ తొలి దశను, లిక్విడ్ ప్రొపెలాంట్ ఇంజిన్‌తో రూపొందించింది. సాలిడ్ ప్రొపెలాంట్ కిక్ మోటార్‌తో రెండో దశను దక్షిణ కొరియా అభివృద్ధి చేసింది. ఈ రాకెట్ తయారీ కోసం దక్షిణ కొరియా 402 మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది.

వెబ్దునియా పై చదవండి