నౌక హైజాక్: రష్యాలో ఎనిమిది మంది అరెస్ట్

స్వీడన్ తీరం బయలుదేరి వెళ్లిన ఓ వాణిజ్య నౌకను హైజాక్ చేసి, దారి మళ్లించినందుకు ఎనిమిది మంది వ్యక్తులను రష్యా అధికారిక యంత్రాంగం అరెస్టు చేసింది. కొన్ని నెలల క్రితం రాడార్ స్క్రీన్లపై నుంచి అదృశ్యమైన ఆర్కిటిక్ సీ అనే నౌకను ఎస్టోనియా పౌరులు హైజాక్ చేసినట్లు రష్యా ప్రభుత్వం వెల్లడించింది.

1.3 మిలియన్ డాలర్ల విలువైన కలప కలిగిన ఈ కార్గో నౌక రహస్య కార్యకలాపాలపై వెళ్లిందని, దీనిని సైనిక, రాజకీయ రహస్యాలు సేకరించే ఉద్దేశంతో గూఢచర్యానికి పంపారని కూడా ప్రచారం సాగింది. అయితే రష్యా రక్షణ శాఖ మంత్రి ఈ నౌక హైజాక్ అయినట్లు, దీనికి సంబంధించి ఎనిమిది ఎస్టోనియా పౌరులను అరెస్టు చేసినట్లు మంగళవారం వెల్లడించారు.

నౌకను విడిపించేందుకు చేపట్టిన ఆపరేషన్‌లో ఎనిమిది మంది హైజాకర్లు పట్టుబడ్డారని మంత్రి చెప్పారు. ఆర్కిటిక్ సీలోకి జులై 24న హైజాకర్లు చొరబడ్డారని, వారివుద్ద ఉన్న ఆయుధాలతో నౌక సిబ్బందిని బెదిరించి దానిని దారి మళ్లించారు. హైజాకర్లు చూపిన మార్గంలో నౌకను సిబ్బంది ఆఫ్రికావైపు తీసుకెళ్లారు.

నావిగేషన్ పరికరాలను పనిచేయకుండా చేయడంతో, నౌక ఆచూకీని ఇప్పటి వరకు కనుగొనలేకపోయామని మంత్రి పేర్కొన్నారు. జులైలో అదృశ్యమైన ఈ నౌక ఇంగ్లీష్ ఛానల్ మీదగా అట్లాంటిక్‌కు వెళ్లే వరకు రాడార్ స్క్రీన్లపై ఉంది. అనంతరం దీనితో రేడియా సంబంధాలు తెగిపోయాయి. ఆగస్టు 4న అల్జీరియాలోని బెజాజా నౌకాశ్రయానికి ఈ నౌక కలపను చేరవేయాల్సి ఉంది.

వెబ్దునియా పై చదవండి