పాకిస్థాన్ భద్రతా దళాలు నిర్వహించిన మెరుపుదాడిలో 14 మంది తీవ్రవాదులు హతమయ్యారు. పాక్-ఆఫ్గన్ సరిహద్దు ప్రాంతంలో తిష్టవేసి, దేశ భద్రతకే ముప్పు కలిగిస్తున్న తీవ్రవాద కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెల్సిందే. దీంతో అమెరికా సైనికులతో కలిసి పాక్ సైనికులు తీవ్రవాద ఏరివేత చర్యల్లో నిమగ్నమై ఉన్నారు.
ఈ నేపథ్యంలో స్వాత్ ప్రాంతంలో భద్రతా బలగాలు నిర్వహించిన దాడుల్లో నలుగురు తీవ్రవాదులు హతమయ్యారు. ఇదేవిధంగా బనర్ జిల్లాలో జరిగిన మరో దాడిలో 10 మంది తీవ్రవాదులను హతమార్చగా, మరో 29 మంది గాయపడినట్టు పాక్ రక్షణ అధికారులు వెల్లడించారు. అలాగే, మరో ప్రాంతంలో జరిగిన దాడిలో మరో నలుగురు మృత్యువాతపడ్డారు. అయితే, వీరిని తాలిబన్ తీవ్రవాదులుగా భావిస్తున్నారు.