పాక్ ఆర్మీకి అమెరికా సాయం చేరడం లేదు

ఉగ్రవాదంపై పోరాడేందు కోసం పాకిస్థాన్‌కు అమెరికా కొన్ని కోట్ల డాలర్లను సాయంగా అందిస్తూ వస్తోంది. అయితే ఆ సాయం పాక్ ఆర్మీకి కాకుండా.. పాక్ ఖజానాలోకి వెళుతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. భారత్‌తో పోరాటం జరపడం వంటి తదితర అంశాలకు ఈ నిధులను మళ్లిస్తున్నట్లు తాజాగా నివేదికలు వెల్లడిస్తున్నాయి.

పాక్ అందుతున్న అమెరికా సాయం కొన్నేళ్లుగా నిరుపరయోగమవుతోందనే విషయాన్ని పాక్ ఆర్మీకి చెందిన ఇద్దరు ఆర్మీ జనరల్స్‌ మీడియాకు తెలిపారు. 2002 మరియు 2008 మధ్య కాలంలో.. అమెరికా.. 6.6 బిలియన్ డాలర్ల సాయాన్ని పాక్‌కు అందించింది. ఇందులో 500 మిలియన్ డాలర్లు.. ఆల్ ఖైదా తిరిగి కోలుకునేందుకు ఉపయోగించినట్లు వారు వివరించారు.

మీడియాకు ప్రకటనలు ఇవ్వకూడదనే పాక్ మిలిటరీలోని నిబంధనలు కారణంగా తమ పేర్లు ఆ ఇద్దరు ఆర్మీ జనరల్స్ వెల్లడించలేదు. పర్వేజ్ ముషారప్.. పాక్ సైనిక, దేశాధ్యక్షుడుగా కొనసాగుతున్న కాలంలో.. మిలిటరీకి చేరాల్సిన సాయాన్ని అవలీలగా ఇతరత్రా ఉపయోగాలకు మళ్లించారని తెలిపారు.

ఆర్థిక రుణాల రూపేణ.. పాక్‌లో ముషారఫ్ తన అధికార దర్పం మాటున ఈ నిధులను మళ్లించేవారని వ్యాఖ్యానించారు. పదవీవిరమణ చేసిన మరియు పదవిలో కొనసాగుతున్న ఆర్మీ జనరళ్లు, మాజీ బ్యూరోక్రాట్లు మరియు ప్రభుత్వ మంత్రులు ఇందుకు మద్దతుగా ఉండేవారన్నారు.

మరోవైపు.. ఆర్మీకి అత్యల్ప నిధులు అందేవని ముషారఫ్ నేతృత్వంలో అమెరికాకు పాక్ రాయబారిగా బాధ్యతలు నిర్వహించి రిటైర్డ్ జనరల్ మహమ్మద్ దురానీ సైతం వెల్లడించారు. అమెరికా నుంచి వచ్చే నిధులు భారత్‌కు వ్యతిరేకంగా పాక్ తన సామర్థ్యాన్ని పెంపొందించేందుకే ఉపయోగించిందన్నారు. సరైన నిర్వహణ లేకనే.. పాక్ ఆర్మీ సైతం కష్టాలను ఎదుర్కొంటోందని దురానీ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి