ఫిలిప్పీన్‌లో తుఫాను : 60 మంది మృతి

ఫిలిప్పీన్ రాజధాని మనీలా తదితర ప్రాంతాల్లో " కేట్సానా "అనే పేరుగల తుఫాను కారణంగా భారీ వర్షాలు కురిసాయి. దీంతో దాదాపు 60 మంది మృతి చెందారు. భీకర తుఫానుతో అతలాకుతలమైన ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు దాదాపు రెండున్నర లక్షలమందికిపైగా నిరాశ్రితులైనారు.

భారీ వర్షాల కారణంగా గత నాలుగు దశాబ్దాలకు మునుపు కురిసిన భారీ వర్షాల రికార్డును కేట్సానా తుఫాను బద్దలు కొట్టిందని అధికారులు తెలిపారు. కేట్సానా తుఫాను రావడంతో మనీలాతోపాటు చుట్టుపక్కలనున్న ఇతర ప్రాంతాల్లో దాదాపు తొమ్మిది గంటల పాటు కుండపోత వర్షం కురిసినట్లు అధికారులు పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా మనీలా పట్టణంలోని దాదాపు 80 శాతం ప్రాంతాలు జలమయమైనాయి. దీంతో కోట్లాది ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారని వారు పేర్కొన్నారు.

ప్రస్తుతం అక్కడ ప్రజలకు తగిన సహాయక చర్యలు చేపట్టినట్లు రక్షణ శాఖామంత్రి గిల్బటరే తియోడోరో తెలిపారు. భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 60 మంది మృతి చెందారని ఆయన తెలిపారు. ఇదిలావుండగా మరో 21 మంది ఆచూకి తెలియడం లేదని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు తమ భద్రతా దళాలు నాలుగు వేలమందిని కాపాడారని ఆయన వివరించారు.

భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో దాదాపు 20 అడుగుల మేర నీరు చేరిపోయింది. దీంతో ప్రజలు తమ తమ ఇండ్ల పైభాగంలోకి చేరుకుని ప్రాణాలను కాపాడుకున్నట్లు ఆయన తెలిపారు.

వెబ్దునియా పై చదవండి