భారత్, పాక్ విదేశాంగ మంత్రుల భేటీ

ముంబైలో 26/11 ఉగ్రవాద దాడులపై చర్చలు జరిపేందుకు భారత్, పాకిస్థాన్ విదేశాంగ మంత్రులు సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాలకు చెందిన విదేశాంగ కార్యదర్శులు న్యూయార్క్‌లో ముందుగా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో 26/11 దాడులకు సంబంధించి పాక్ చేస్తున్న దర్యాప్తు పురోగతిపై కీలక చర్చలు జరుపనున్నారు.

భారత విదేశాంగ కార్యదర్శి నిరుపమా రావ్ మరియు పాక్ విదేశాంగ కార్యదర్శి సల్మాన్ బషీర్.. శనివారం న్యూయార్క్‌లోని రూస్‌వెల్ట్ హోటల్‌లో అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈజిప్టులో ఈ ఏడాది జూలైలో షర్మ్ ఇల్ షేక్ వద్ద భారత్, పాక్ ప్రధాన మంత్రులు సమావేశమైన సంగతి తెలిసిందే.

దాని తర్వాత విదేశాంగ మంత్రుల సమావేశానికి ఒక రోజు ముందు ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శులు కీలక చర్చలు జరుపడం ఇదే తొలిసారి. దీంతో ఈ చర్చలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. పాక్ చేస్తున్న దర్యాప్తులో సహకారించేందు కోసం.. భారత్ అందించిన నివేదికలతో కూడిన సమాచారానికి సంబంధించిన అంశం ఈ సమావేశంలో చర్చించారు.

అయితే.. ముంబై దాడుల సూత్రధారి అయిన జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయూద్‌పై పాక్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఈ చర్చల్లో భారత్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. కాగా, ఐక్యరాజ్య సమితి సమావేశాల సందర్భంగా భారత్, పాక్ విదేశాంగ మంత్రులు ఈ రోజు సమావేశం కానున్నారు.

వెబ్దునియా పై చదవండి