లంక సైనికుల తాజా పోరులో 44 మంది మృతి

శ్రీలంక ప్రభుత్వ దళాలు శుక్రవారం ఎల్టీటీఈ వద్ద నుంచి కీలక గ్రామాన్ని స్వాధీనం చేసుకున్నాయి. ఈ సందర్భంగా దేశంలోని సమస్యాత్మక ఉత్తర ప్రాంతంలో ఎల్టీటీఈకి, ప్రభుత్వ దళాలకు మధ్య జరిగిన తాజా పోరులో 44 మంది తీవ్రవాదులు మృతి చెందారని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

ఎల్టీటీఈ గోదాములుగా ఉపయోగించుకుంటున్న ఆనందపురం గ్రామంలోకి ప్రభుత్వ దళాలు గురువారం ప్రవేశించాయని మిలటరీ ప్రతినిధి బ్రిగేడియర్ ఉదయ నానాయక్కరా తెలిపారు. ఈ గ్రామాన్ని ప్రభుత్వ దళాల చేతిలోకి చేరకుండా ఉండేందుకుగాను ఎల్టీటీఈ గట్టిగా ప్రతిఘటించింది. ఈ సందర్భంగా జరిగిన పోరులో ఇద్దరు ఎల్టీటీఈ సీనియర్ నేతలతోపాటు, 44 మంది తీవ్రవాదులు మృతి చెందారని వెల్లడించారు.

ఇదిలా ఉంటే శ్రీలంకలో ఎల్టీటీఈ ఆధీనంలో ఇప్పుడు ఎనిమిది చదరపు మైళ్ల భూభాగం మాత్రమే ఉంది. ఎల్టీటీఈకి, ప్రభుత్వ దళాలకు మధ్య యుద్ధం జరుగుతున్న ప్రాంతంలో 150000 మంది పౌరులు ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి, విదేశీ సహాయక సంస్థలు అంచనా వేస్తున్నప్పటికీ, శ్రీలంక ప్రభుత్వం మాత్రం ఈ సంఖ్యలో సగంకంటే తక్కువ మంది మాత్రమే అక్కడ ఉన్నారని చెబుతోంది.

వెబ్దునియా పై చదవండి