సయీద్‌ నిర్బంధంలో లేడు: పాక్ పోలీసులు

నిషేధిత తీవ్రవాద సంస్థ జమాదుత్ దవా చీఫ్ సయీద్ మొహమ్మద్ సయీద్ గృహ నిర్బంధంలో లేడని పాకిస్థాన్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. పాక్ పోలీసులు సయీద్‌ను అరెస్ట్ లేదా రక్షణాత్మక కస్టడీలోకి తీసుకోలేదని తెలిపారు. సయీద్ పరిస్థితిపై అనుమానాలు మరింత బలపడ్డాయి.

అమెరికాలో ఇరుదేశాల విదేశాంగ మంత్రులు మరో రెండు రోజుల్లో సమావేశం కానున్న నేపథ్యంలో.. ఈ విషయం వెలుగులోకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సయీద్‌ను గృహ నిర్బంధంలో ఉంచినట్లు ఇటీవల పాకిస్థాన్ పోలీసు యంత్రాంగం వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సయీద్ గృహ నిర్బంధంలో లేడని పోలీసు వర్గాలు చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది.

పంజాబ్ పోలీసు చీఫ్ తారీక్ సలీం దోగార్ మాట్లాడుతూ.. సయీద్‌ను తాము అరెస్ట్ చేయడం లేదా గృహ నిర్బంధంలో ఉంచడమేదీ చేయలేదని, అదే విధంగా రక్షణాత్మక కస్టడీలోనూ లేడని వెల్లడించారు. అతని వ్యక్తిగత భద్రతను దృష్టిలో ఉంచుకొని బయటకు రావడంపై ఆంక్షలు విధించుకోవాలని విజ్ఞప్తి చేశామన్నారు.

గత ఏడాది ముంబయిలో జరిగిన ఉగ్రవాద దాడులకు సయీద్ కూడా ఓ ప్రధాన సూత్రధారి అని భారత్ బలంగా విశ్వసిస్తున్న సంగతి తెలిసిందే. అతనిపై ముంబయి దాడుల కేసు నమోదు చేసి, విచారణ చేపట్టాలని భారత్ డిమాండ్ చేస్తోంది. అయితే పాక్ ప్రభుత్వం అతనిపై ఈ దాడులకు సంబంధించి చర్యలు తీసుకునేందుకు తమ వద్ద బలమైన ఆధారాలేవని, విశ్వసనీయ ఆధారాలు ఉంటే అతనిపై చర్యలు తీసుకుంటామని చెబుతోంది.

వెబ్దునియా పై చదవండి