సయీద్ విడుదలపై అమెరికా అసహనం

ముంబయి ఉగ్రవాద దాడుల ప్రధాన సూత్రధారిగా భారత్ భావిస్తున్న జమాదుత్ దవా చీఫ్ హఫీజ్ మొహమ్మద్ సయీద్ గృహ నిర్బంధం నుంచి విడుదల కావడంపై పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌లకు అమెరికా ప్రత్యేక రాయబారి రిచర్డ్ హూల్‌బ్రూక్ అసహనం వ్యక్తం చేశారు. తామందరినీ తాజా పరిణామం చికాకు పెడుతుందని చెప్పారు.

ఇదిలా ఉంటే పాకిస్థాన్ ప్రభుత్వానికి అమెరికా మిలిటరీ సాయాన్ని కొనసాగిస్తుందని హోల్‌బ్రూక్ స్పష్టం చేశారు. పాకిస్థాన్‌కు అమెరికా 17 హెలికాఫ్టర్లు అందజేయనున్నట్లు వెల్లడించారు. హోల్‌బ్రూక్ నేతృత్వంలోని అమెరికా బృందం పాకిస్థాన్ సమస్యాత్మక స్వాత్ లోయలో , దాని పరిసర ప్రాంతాల్లో పర్యటించనుంది.

గత కొన్ని వారాలుగా పాక్ సైన్యానికి, తాలిబాన్ తీవ్రవాదులకు మధ్య ఈ ప్రాంతాల్లో పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సైనిక ఆపరేషన్ కారణంగా ప్రాణభయంతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లి సహాయక శిబిరాల్లో తలదాచుకున్న వేలాది మంది పౌరుల పరిస్థితిని అమెరికా అధికార బృందం పరిశీలించనుంది. హోల్‌బ్రూక్ బృందం జూన్ 5 వరకు పాకిస్థాన్‌లోనే ఉండనుంది.

వెబ్దునియా పై చదవండి