గత ఏడాది దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో టెర్రరిస్టులు జరిపిన దాడికి సంబంధించి సమగ్రంగా పరిశోధించడానకి మరింత సమయం కావాలని పాకిస్తాన్ భారత్‌ను కోరింది. గురువారం జరిగిన రెండు దేశాల ద్వైపాక్షిక సమావేశంలో ఈ మేరకు పాకిస్తాన్ అభ్యర్థించింది. ఉగ్రవాద దాడుల్లో జేయూడీ చీఫ్ హఫీజ్ మహ్మద్ సయీద్ పాత్ర ఎంత ఉన్నదన్న విషయాన్ని తెలుసుకునేందుకు మరింత పరిశీలించాల్సిన అవసరం ఉంది కనుక వ్యవధి కావాలని తెలిపింది.
కాగా భారతదేశం సమర్పించిన సాక్ష్యాధారాలను సైతం పరిశీలించాల్సి ఉందని పేర్కొంది. భారతదేశం తమకు సమర్పించిన సాక్ష్యాలను ఆధారం చేసుకోవడంతోపాటు కేసుకు సంబంధించి పాకిస్తాన్‌లో అదుపులోకి తీసుకున్న నిందితులను విచారించాల్సి ఉందని పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి రెహ్మాన్ మాలిక్ పేర్కొన్నారు.
మరోవైపు పాకిస్తాన్‌కు తగిన సాక్ష్యాధారాలను సమర్పించినప్పటికీ... దర్యాప్తును నత్తనడకన సాగిస్తుండటంపై భారతదేశం అసంతృప్తిని వ్యక్తం చేసింది. దర్యాప్తును వేగిరవంతం చేసి దోషులను నిలబెట్టాలని కోరింది.