హోండురస్ మహిళా జైలులో మారణహోమం జరిగింది. ఈ జైలులో చెలరేగిన అల్లర్ల కారణంగా 41 మంది మహిళా ఖైదీలు మృత్యువాతపడ్డారు. వీరిలో కొందరిని కాల్చి చంపితే మరికొందరిని సజీవ దహనం చేశారు. ఇంకొందరిని కత్తితో పొడిచి చంపేశారు. ఈ మారణహోమం హోండురస్ రాజధాని టెగుసిగలప్పకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న టమారా జైలులో జరిగింది.
ఈ ఘర్షణల్లో తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిలో చనిపోయిన 41 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు ఫోరెన్సిక్ బృందం తెలిపారు. హింస తర్వాత జైలు నుంచి పలు తుపాకులు, పెద్ద ఎత్తున కత్తులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ హింసా కాండపై హోండురస్ అధ్యక్షుడు సియోమరా కాస్ట్రో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జైలులో ఆధిపత్యం కలిగిన మరాస్ వీధి ముఠాల పనేనని ఆయన తెలిపారు. దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బారియో 18 ముఠా జైలులోని ఖైదీల బ్లాకులోకి చొరబడి కొందరిని కాల్చి చంపేసింది. మరికొందరిని తగలబెట్టింది. ఈ ఘటనతో దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.