తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఘోరం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, 80 మందికి పైగా గాయపడ్డారు. జర్నీ సినిమా తరహాలో వేగంగా వస్తున్న రెండు ప్రైవేట్ బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళితే.. కడలూరు నుంచి బన్రుట్టికి వెళ్తున్న బస్సు, బన్రుట్టి నుంచి కడలూరు వెళ్తున్న మరో బస్సు ఢీకొన్నాయి. బన్రుట్టికి వెళ్లే బస్సు టైరు పేలిపోవడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టింది.
ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, రెండు బస్సుల్లోని 80 మంది ప్రయాణికులు గాయపడ్డారు. పెట్రోలింగ్ బృందం, స్థానిక పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన బాధితులను చికిత్స నిమిత్తం కడలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.