ఆస్ట్రేలియాలో విద్యాభ్యాసం చేసేందుకు భారతీయ విద్యార్థులెవ్వరూ ఆసక్తి చూపడం లేదు. దీనికి నిదర్శనంగా ఆ దేశానికి అందుతున్న వీసా దరఖాస్తులనే చెప్పుకోవచ్చు. ఈ యేడాది ఏకంగా 63 శాతం వీసాల తగ్గుదల కనిపించింది. అంతర్జాతీయంగా ప్రపంచ దేశాల నుంచి అందుతున్న వీసా దరఖాస్తుల్లో సైతం 20 శాతం మేర తగ్గుదల ఉన్నట్లు ప్రభుత్వ తాజా గణాంకాలు వెల్లడించాయి.
ఈ విషయంపై ఆస్ట్రేలియా వలస వ్యవహారాల (ఇమ్మిగ్రేషన్) విభాగం గత నెల గణాంకాలతో కూడిన ఒక ప్రకటనను విడుదల చేసింది. ఈ తాజా వివరాల ప్రకారం 2009-10 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి 18,514 వీసా దరఖాస్తులు అందగా 2010-11 కాలంలో ఈ సంఖ్య 6,875కు పడిపోయినట్టు పేర్కొంది.
భారత్ తర్వాత అంతర్జాతీయ విద్యార్థులు ఎక్కువగా వచ్చే చైనా నుంచి సైతం వీసా దరఖాస్తుల సంఖ్య 24.3 శాతానికి పడిపోయినట్లు ఇమ్మిగ్రేషన్ విభాగం వెల్లడించింది.