జపాన్ దేశానికి చెందిన క్రూయిజ్ షిప్‌లో ఉన్న 66 మందికి కరోనా వైరస్ సోకింది. ఈ మేరకు వారికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో నిరూపితమైంది. దీంతో వారందనీ నిర్బంధంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ డైమండ్ ప్రిన్సెస్ విహార నౌకలో 3,700 మంది ఉండగా, వారిలో 1100 మంది సిబ్బంది. టోక్యో నగరానికి దక్షిణంగా ఉన్న యోకోహామా సమీపంలోని సముద్రంలోనే నిలిపి కరోనా వైరస్ ప్రబలకుండా చికిత్స అందిస్తున్నారు.
ఈ ఓడలో నుంచి హాంకాంగ్‌లో దిగిన ఓ ప్రయాణికుడికి కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో ఓడలోని వారందరినీ రెండు వారాల పాటు నిర్బంధంలో ఉంచారు. ఓడలో నిర్బంధంలో ఉన్నవారిలో 39 మందికి కరోనావైరస్ సోకగా వారిలో 10 మంది జపాన్ దేశస్థులున్నారు. మరో 10 మంది ఓడ సిబ్బంది. మిగతా రోగులు అమెరికా, చైనా దేశాలకు చెందిన వారని జపాన్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి చెప్పారు.
నౌకలోని ప్రయాణికులను క్యాబిన్లలోనే ఉంచి మాస్కులు ఇచ్చి చికిత్స చేస్తున్నారు. వ్యాధి తగ్గితే ఈ నెల 19వ తేదీన ఓడ నుంచి వారిని విడుదల చేయాలని జపాన్ వైద్యాధికారులు యోచిస్తున్నారు. మరోవైపు చైనాను వణికిస్తున్న కరోనా వైరస్ సింగపూర్ దేశానికి వ్యాపించడంతో ఆ దేశంలో పర్యటించవద్దని పలు దేశాలు తాజాగా హెచ్చరికలు జారీ చేశాయి.