'కాంతార చాప్టర్-1'కు ఆటంకాలు కలిగించొద్దు : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఠాగూర్

మంగళవారం, 30 సెప్టెంబరు 2025 (10:35 IST)
కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం "కాంతార చాప్టర్-1". అక్టోబరు రెండో తేదీన విడుదలకానుంది. కన్నడంలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా అఖండ విజయాన్ని సాధించిన "కాంతార" తొలి భాగానికి ఇది ప్రీక్వెల్‌గా రానుంది. అయితే, ఈ చిత్రం టికెట్ ధరల పెంపుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతించనున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు.
 
తెలుగు చిత్రాలను కర్ణాటకలో విడుదల చేసే సమయంలో ఎదురవుతున్న సమస్యలను సినీ వర్గాలు పవన్ దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో, ఆయన దీనిపై స్పందించారు. తాను హీరోగా నటించిన 'ఓజీ' సినిమాకు కూడా కర్ణాటకలో పోస్టర్లు, బ్యానర్లు తొలగిస్తున్నారని, కష్టాలు ఎదురవుతున్నాయని తెలిపారు.
 
'కర్ణాటకలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని, ఇక్కడి ప్రేక్షకులు అక్కడి చిత్రాలకు ప్రోత్సాహం ఇవ్వడం ఆపకూడదు. మంచి మనసుతో, జాతీయ భావోద్వేగాలతో ఆలోచించాలి. కన్నడ కంఠీరవ డా.రాజ్ కుమార్ నుంచి రిషబ్ శెట్టి వరకూ తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. రెండు రాష్ట్రాల ఫిల్మ్ ఛాంబర్లు కలిసి సమస్యలపై చర్చించాలి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాను. కర్ణాటకలో తెలుగు సినిమాలు ఎదుర్కొంటున్న సమస్యల్ని దృష్టిలో ఉంచుకుని, 'కాంతార చాప్టర్-1' వంటి సినిమాలకు ఆటంకాలు కల్పించకూడదని కోరుతున్నాను' అని పవన్ అభిప్రాయపడ్డారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు