ఆప్ఘనిస్థాన్‌లో వరదలు.. 100మంది మృతి.. నిరాశ్రయులైన వేలాది మంది

గురువారం, 27 ఆగస్టు 2020 (10:08 IST)
Flood
ఆఫ్ఘనిస్థాన్‌ దేశంలో సంభవించిన వరదల్లో 100 మంది మృతి చెందారు. ఆఫ్ఘనిస్థాన్‌ తూర్పు, ఉత్తర ప్రాంతంలో కురసిన భారీ వర్షాలతో వెల్లువెత్తిన వరదల వల్ల 100 మంది మరణించారని అధికారులు చెప్పారు. ఛారికర్ సెంట్రల్ సిటీలోని ఆసుపత్రి వరదనీటి పాలవడంతో అందులో ఉన్న రోగులను కాబూల్ నగరంలోని ఆసుపత్రికి తరలించామని ఆఫ్ఘనిస్థాన్‌ డిజాస్టర్ మేనేజ్ మెంట్ మంత్రి గులాం బహవుద్దీన్ జిలానీ చెప్పారు. 
 
వరదల వల్ల దెబ్బతిన్న ఇళ్లలో ప్రజలు మరణించి ఉన్నారని, పోలీసులు, సహాయ బృందాలు సహాయ చర్యలు చేపట్టాయని, వరద మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికార ప్రతినిధి వడీదా షహకర్ చెప్పారు. వరదల వల్ల గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి ప్రతినిధి అబ్దుల్ ఖాసిం చెప్పారు. 
 
కాబూల్ జాతీయ రహదారిపై ఇద్దరు పిల్లలు వరదల్లో మునిగిపోగా, మరో 14 మంది గాయపడ్డారు. రాత్రికి రాత్రి వరదనీరు రావడంతో పలు ఇళ్లు వరదనీటిలో మునిగాయని అధికారులు చెప్పారు. వరదల్లో 2వేల ఇళ్లు నీట మునగడంతో.. ఇళ్లు దెబ్బతినగా 1000 మంది నిరాశ్రయులయ్యారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు