పాకిస్థాన్‌లో భారత ఆర్మీ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తాము శాంతినే కోరుకుంటున్నామని.. అయితే ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదులు ఎగుమతి చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పాకిస్థాన్‌ను ఉగ్రవాదుల ఎగుమతి ఫ్యాక్టరీగా మోదీ అభివర్ణించారు.
2016లో నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ గురించి లండన్‌లోని చారిత్రక వెస్ట్‌మినిస్టర్ సెంట్రల్ హాల్‌లో ప్రవాస భారతీయులతో నిర్వహించిన ''భారత్ కీ బాత్, సబ్‌కే సాథ్'' కార్యక్రమంలో ఆసక్తి కరమైన విషయాలను వెల్లడించారు. సర్జికల్ స్ట్రైక్స్‌తో పాకిస్థాన్‌కు స్పష్టమైన సంకేతాలు పంపినట్టు తెలిపారు. సర్జికల్ స్ట్రైక్స్ జరిగిన తర్వాత ఆ విషయం భారత ప్రజలకు తెలియజేసేందుకు ముందే పాకిస్థాన్‌కు చెప్పేందుకు ప్రయత్నించామని.. అయితే ఉదయం 11 గంటల నుంచి ఫోన్ చేస్తుంటే 12 గంటలకు వారితో మాట్లాడగలిగామని చెప్పారు.
పదేపదే ఫోన్ చేస్తున్నా వారు ఫోన్ తీసేందుకు భయపడ్డారని... చివరికి వారికి చెప్పిన తర్వాతే భారత మీడియాకు విషయాన్ని వెల్లడించామని మోదీ తెలిపారు. వారికి సమయం ఉంటే ఉగ్రవాదుల మృతదేహాలు తీసుకెళ్లాలని కోరామని మోదీ అన్నారు. సర్జికల్ స్ట్రైక్స్‌ను భారత ఆర్మీ పరిపూర్ణంగా నిర్వహించి వెనక్కి వచ్చిందని కొనియాడారు. ''భారత్ కీ బాత్, సబ్‌కే సాథ్'' కార్యక్రమంలో దాదాపు 1700 మంది పాల్గొన్నారు. వీరిలో అత్యధికులు భారతీయులే కావడం గమనార్హం.