ఐరాస వేదికపై రజనీ కుమార్తె ఐశ్వర్య భరతనాట్యం.. ఇదేం డ్యాన్సంటూ సోషల్ మీడియాలో మీమ్స్ వీడియో

శనివారం, 11 మార్చి 2017 (18:29 IST)
ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య భరతనాట్యాన్ని ప్రదర్శించింది. తన ప్రదర్శన ద్వారా లింగ సమానత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. లింగ సమానత్వం, మహిళా సాధికారతకు సంబంధించి భారత్‌లో ఐక్యరాజ్యసమితి ప్రతినిధిగా ఐశ్వర్య వ్యవహరిస్తున్నారు. ప్రారంభంలో నటరాజస్వామిని స్తుతిస్తూ భో.. శంభో అనే పాటకు ఆమె చేసిన నృత్యం ప్రేక్షకులను ఆకట్టుకుంది.  
 
ఈ ప్రదర్శనను తిలకించడానికి ఐరాస జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు పీటర్ థామ్సన్ సహా పలువురు దౌత్యవేత్తలు, అధికారులు హాజరయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ ప్రదర్శన ఇచ్చే అవకాశం రావడం తనకు గొప్ప గౌరవమని ఐశ్వర్య పేర్కొన్నారు. అయితే ఐశ్వర్య డ్యాన్స్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో ఐశ్వర్య డ్యాన్స్‌పై మెమ్స్ వచ్చేశాయి. భరతనాట్యం రాని ఐశ్వర్యకు ఐరాస వేదికపై ఆడే అవకాశం ఎలా వచ్చిందని భరతనాట్య కళాకారులు ప్రశ్నిస్తున్నారు. 
 
భరతనాట్యాన్ని ప్రాణానికి పైగా గౌరవించే కళాకారులు.. ఒకటి రెండు వేదికలపై భరతం ఆడిన రజనీ కుమార్తెకు ఇలాంటి ఛాన్స్ ఎందుకిచ్చారని ప్రశ్నిస్తున్నారు. అంతేగాకుండా ఐశ్వర్య వీడియో యూట్యూబ్‌లో రావడంతో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. సరైన శిక్షణ లేకపోవడంతో ఐశ్వర్య భరత నాట్యంలో లోటుపాట్లున్నాయని.. రజనీ కుమార్తె, ఐక్యరాజ్యసమితి ప్రతినిధిగా ఉన్న కారణంతోనే ఈ ఛాన్స్ ఆమెకు వచ్చిందంటున్నారు. 
 
మరోవైపు ఐరాస వేదికపై భరత నాట్యం చేసిన ఐశ్వర్య డ్యాన్స్ వీడియోకు మీమ్స్ వీడియో వచ్చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ హిట్ అయిపోయింది. ఆ వీడియోను మీరూ చూడండి. 

 

వెబ్దునియా పై చదవండి