సిరియా అంతర్యుద్ధం నుంచి బయటపడిన ఐదేళ్ల ఒమ్రాన్ డాక్వినీష్.. తన కుటుంబాన్ని కోల్పోయిన విషయాన్ని తెలియక.. అసలేం జరిగిందో తెలియక అలానే గాయాలతో రక్తపు మరకలతో కూర్చుండిపోయిన ఫోటో గతంలో ప్రపంచ జనాలను కలచివేసింది. ఈ నేపథ్యంలో న్యూయార్క్ నగరానికి చెందిన ఆరేళ్ల అలెక్స్ అనే కుర్రాడు.. ఒమ్రాన్ డాక్వినీష్‌కు తాను కుటుంబాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఒబామాకు రాసిన లేఖలో తెలిపాడు.
హృదయాన్ని కదిలించిన ఆ లేఖను ఒబామా ఐరాస సభలో చదివి వినిపించారు. అంతేగాకుండా లేఖ రాసిన అలెక్స్ ఆ లేఖను చదివి వినిపించిన వీడియో తన ఫేస్ బుక్ పేజీలో ఒబామా పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ప్రస్తుతం 80లక్షల వ్యూవ్స్ వచ్చాయి. 1,50,000 మంది ఈ వీడియోను ఫేస్ బుక్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను మీరూ చూడండి..
కాగా గత ఆగస్టులో సిరియాలోని అలెప్పోలో జరిగిన వైమానిక దాడుల్లో గాయపడి, నిర్ఘాంతపోయిన బాలుడు ఒమ్రాన్ డాక్వినీష్‌ని మర్చిపోలేము. దుమ్ము, రక్తంతో తడిసిపోయిన ఆ బాలుడికి రెస్క్యూ సిబ్బంది సేవలందించారు. ఈ బాలుడి ఫొటో నాడు వైరల్‌గా మారడంతో హృదయమున్న ప్రతిఒక్కరూ స్పందించారు.
ఈ నేపథ్యంలో డాక్వినీష్ ఘటన కలచి వేసిందని అలెక్స్ రాసిన ఉత్తరంలో ‘డియర్ ప్రెసిడెంట్ ఒబామా... సిరియాలో ఈ మధ్య జరిగిన దాడుల్లో గాయపడ్డ బాలుడు గుర్తున్నాడా? ఇప్పుడు అతను ఎక్కడున్నా వెతికి మా ఇంటికి తీసుకువస్తారా? ఆ బాలుడిని తీసుకువచ్చేవరకు మేము జెండాలు, పూలు, బెలూన్లతో ఎదురుచూస్తుంటాం. అతన్ని ఒక సోదరుడిలా చూసుకుంటాను.. అతనికి మంచి కుటుంబాన్నిస్తాం'' అంటూ ఆ చిన్నారి తన హృదయ స్పందనను లేఖ ద్వారా ఒబామాకు తెలియాజేశాడు.