క్రైమ్ థ్రిల్లర్‌ను తలపిస్తోన్న అమెరికా వ్యక్తి జీవితం..

శుక్రవారం, 24 మే 2019 (14:44 IST)
అమెరికాకు చెందిన 73 ఏళ్ల రిచర్డ్ ఫిలిప్స్ అనే వ్యక్తి జీవితం సినిమాలో చూపినట్లు ఓ క్రైమ్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. గ్రెగరీ హర్రిష్ అనే వ్యక్తి హత్య కేసులో చేయని తప్పుకు ఫిలిప్స్ జైలుకు వెళ్లగా 46 ఏళ్ల తరువాత అసలు నిందితుడు లొంగిపోగా, ఫిలిప్స్‌ను కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. 
 
రిచర్డ్ ఫిలిప్స్ నిర్దోషి అని తేలడంతో మిచిగాన్ దోషపూరిత ఖైదు పరిహారం చట్ట ప్రకారం అతడికి జైలులో గడిపిన ఒక్కొ ఏడాదికి 50 వేల డాలర్ల చొప్పున 46 ఏళ్లకు 1.5 మిలియన్ డాలర్లు (రూ. 10,45,69,500) అందనున్నాయి. 
 
ఈ మేరకు మిచిగాన్ అటార్నీ జనరల్ దానా నెస్సెల్ ప్రకటించారు. ఈ పరిహారంపై ఎలాంటి పన్నులు విధించకుండా చట్ట ప్రకారం పూర్తి మొత్తం ఫిలిప్స్‌ చేతికి అందుతుందని అతడి తరఫు న్యాయవాది గబి సిల్వర్ పేర్కొంది. 
 
1972వ సంవత్సరంలో ఫిలిప్స్ వయస్సు 27 ఏళ్లు ఉన్నప్పుడు అతనికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. అప్పటి నుంచి గత నాలుగు దశాబ్దాలకు పైగా కటకటాల్లోనే గడిపాడు. అయితే, 2010లో ఈ హత్యకేసులో అసలు నిందితుడు రిచర్డ్ పొలొంబో అనే వ్యక్తిగా తేలడంతో 2017లో తిరిగి ఫిలిప్స్‌పై కోర్టులో విచారణ మొదలవగా, ఏడాది తరువాత 2018 మార్చి నెలలో ఫిలిప్స్‌ జైలు నుంచి విడుదలయ్యాడు. 
 
ఇలా చేయని తప్పుకు 46 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన రిచర్డ్ ఫిలిప్స్‌కు భారీ పరిహారం అందనుంది. ప్రస్తుతం ఓ అపార్ట్‌మెంట్‌లో కిరాయికి ఉంటున్న ఫిలిప్స్ పరిహారం చేతికి అందగానే ఓ చిన్న ఇల్లు కొనుక్కొని తన శేష జీవితాన్ని సుఖ సంతోషాలతో ఆనందంగా గడపాలని అతడి తరఫు న్యాయవాది గబి సిల్వర్ అభిలషించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు