డోనాల్డ్ ట్రంప్ శకానికి స్వస్తి.. నేడు బైడెన్‌ ప్రమాణ స్వీకారం

బుధవారం, 20 జనవరి 2021 (05:49 IST)
నాలుగేళ్ళ డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ పాలనకు నేటితో తెరపడనుంది. ఆయన స్థానంలో అమెరికా కొత్త అధ్యక్షుడుగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గత యేడాది నవంబరులో జరిగిన అమెరికా అధ్యక్ష పీఠం ఎన్నికల్లో అప్రతిహత విజయం సాధించిన బైడెన్‌ - కమలా హారిస్‌ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే, ఇటీవల ట్రంప్‌ అనుచరుల దుశ్చర్యలను దృష్టిలో పెట్టుకొని వాషింగ్టన్‌ నగరమంతటా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేశారు. 
 
అగ్రరాజ్యం అమెరికా దేశ 46వ అధ్యక్షుడిగా డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన జో బైడెన్‌, ఆ దేశ ఉపాధ్యక్షురాలిగా భారతీయ మూలాలున్న కమలా హారిస్‌ బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. నాలుగేళ్ల పాటు అనేక ఆటుపోట్ల మధ్య సాగిన డొనాల్డ్‌ ట్రంప్‌ హయాం 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ముగుస్తుంది. 
 
ఈనెల 6వ తేదీన కేపిటల్‌ భవనంపై తన మద్దతుదారులను ఉసిగొల్పిన ఘటనపై కాంగ్రెస్‌ అభిశంసనను ఎదుర్కొన్న ఆయన అనేక సవాళ్లను బైడెన్‌కు విడిచి వెళుతున్నారు. అదేసమయంలో సంప్రదాయాలకు విరుద్ధంగా ఆయన బైడెన్‌ ప్రమాణస్వీకారోత్సవానికి కూడా హాజరుకాబోవడం లేదు. కానీ, మాజీ అధ్యక్షులు అనేక మంది ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరవుతున్నారు. 
 
అలాగే, ట్రంప్ జూనియర్‌గా పనిచేసిన (ఉపాధ్యక్షుడు) మైక్‌ పెన్స్‌ హాజరవుతారు. సుమారు 25,000 మంది నేషనల్‌ గార్డ్స్‌ వాషింగ్టన్‌ మొత్తాన్ని కమ్మేశారు. గతంలో అధ్యక్ష ప్రమాణ స్వీకారోత్సవాలకు నియమించిన భద్రతకు ఇది మూడు రెట్లు ఎక్కువ. వాషింగ్టన్‌ నగరం ఓ దుర్భేద్యమైన కోటను తలపిస్తోంది. 
 
కేపిటల్‌ భవన ప్రాంగణం సమీపానే ప్రమాణస్వీకారం జరగనున్నందున అంతర్గతంగా ఎవరైనా దాడులకు దిగొచ్చేమోనన్న భయాలు భద్రతా అధికారులను వెన్నాడుతున్నాయి. ప్రమాణస్వీకార వేదిక వద్ద ట్రంప్ ‌- అనుకూల గార్డ్స్‌ ఎవరూ లేకుండా సీక్రెట్‌ సర్వీస్‌, ఆర్మీ ప్రయత్నిస్తున్నాయి. 
 
ప్రమాణస్వీకార ఉత్సవాన్ని తిలకించడానికి వేలమంది ప్రజలు సాధారణంగా హాజరయ్యే నేషనల్‌ మాల్‌ను ఈసారి మూసేశారు. కేపిటల్‌ భవనం చుట్టుపక్కల కనీసం మూడు మైళ్ల దూరం దాకా ఎవరూ ప్రవేశించలేని స్థితి! 
 
ఒక్క వాషింగ్టన్‌లోనే కాదు, దేశంలోని 50 రాష్ట్రాల ప్రధాన నగరాల్లోనూ భారీభద్రత ఏర్పాట్లు చేశారు. డోనాల్డ్ ట్రంప్ వైఖరితో పాటు.. ఆయన మద్దతుదారులు పాల్పడిన దుశ్చర్యల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు